ప్రత్యక్ష ఎన్నికలంటూ హడావుడి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష ఎన్నికలంటూ హడావుడి

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

ప్రత్యక్ష ఎన్నికలంటూ హడావుడి

మేయర్‌ ‘వార్‌’

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సగం సీట్లు కావాల్సిందేనని జనసేన.. జనసేనకు అంత సీన్‌ లేదంటూ టీడీపీ.. ఏలూరు నగర మేయర్‌తో సహా నాలుగు మున్సిపల్‌ చైర్మన్లు కావాలని జనసేన.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలిచ్చి పార్టీ అధిష్టానం సరిపెడుతుందని టీడీపీ.. ఇలా రెండు పార్టీల మధ్య కుమ్ములాటలకు స్థానిక సంస్థల ఎన్నికలు తెరలేపాయి. జనసేన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలు మొత్తం జనసేనకే ఇవ్వాలని డిమాండ్‌ తెరమీదకు తెచ్చిన క్రమంలో కౌంటర్‌గా టీడీపీ నేతలు ఆశావహులను ప్రమోట్‌ చేస్తూ హడావుడికి తెరతీయడం ఉమ్మడి పశ్చిమలో చర్చనీయాంశంగా మారింది.

మాదంటే.. మాదంటూ.. ఉమ్మడి పశ్చిమలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ముందుగానే మొదలైంది. సామాజిక, పార్టీ ఓటింగ్‌, పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా కచ్చితంగా 50 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని జనసేన బలంగా డిమాండ్‌ చేస్తోంది. దానికనుగుణంగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న జనసేన సమావేశాల్లో ఎమ్మెల్యేలు సైతం అదే మాట చెబుతున్నారు. ఇక దీనికి సమాంతరంగా టీడీపీ నేతలు కూడా సమావేశాల్లో మెజార్టీ స్థానాలు తెలుగుదేశానికే ఉంటాయని ఆశావహులంతా సిద్ధంగా ఉండాలని, ఎవరి ప్రచారాలను పట్టించుకోవద్దంటూ పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ స్థానంపై రెండు పార్టీల్లో బలమైన పోటీ ప్రారంభమైంది. జనసేనకు అత్యధిక బలం ఉండి, పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ అసెంబ్లీ సీటు ఇచ్చామని, దానికి అనుగుణంగా అప్పట్లో నగర మేయర్‌ స్థానం తమకు వస్తుందని పార్టీ పెద్దలు చెప్పారని దానికనుగుణంగా ఏలూరు మేయర్‌ స్థానం తమకు ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధానంగా ఏలూరు నగరపాలక సంస్థ, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలు కోసం జనసేన నేతలు పట్టుబడుతున్నారు. ఇదే క్రమంలో ఆయా స్థానాల కోసం టీడీపీ నేతల నుంచి బలమైన పోటీ ప్రారంభమైంది. టీడీపీ మరో అడుగు ముందుకేసి హడావుడిగా ఆశావహులను తెరపైకి తెస్తుంది.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలతో పాటు ఆకివీడు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్ని మున్సిపాల్టీలు పునర్విభజన, ఇతర అంశాలపై కోర్టులో కేసు ఉన్నా ఎన్నికలు జరుగుతాయని ముందస్తు హడావుడికి తెరలేచింది. దీంతో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మున్సిపాల్టీతో పాటు అత్యధిక స్థానాలు పొత్తుల్లో దక్కించుకుంటామంటూ వ్యాఖ్యానించారు. అలాగే భీమవరం మున్సిపాల్టీలో టీడీపీ, జనసేన చైర్మన్‌ స్థానాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీరియస్‌గా మున్సిపల్‌ చైర్మన్‌ కోసం పట్టుపట్టకపోయినా నేతలు మాత్రం బలంగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు 50 వార్డులున్న భీమవరంలో 20 వార్డులు బీజేపీకి ఇవ్వాలని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ డిమాండ్‌ చేయడం విశేషం. తణుకులో పొత్తుల్లో జనసేనకు దక్కాల్సిన సీటును త్యాగం చేసినందుకు మున్సిపల్‌ చైర్మన్‌ జనసేనకే ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతలు మాత్రం అన్ని సీట్లు, అన్ని స్థానాలు ఇచ్చేంతా సీన్‌ లేదని ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి కోట్లు ఖర్చు పెట్టేవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, జనసేనకు ప్రతిచోట 15 శాతానికి మించకుండానే సీట్లు ఉంటాయని కేడర్‌కు బలంగా చెబుతున్నారు.

ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ స్థానం కోసం జనసేన బలంగా ప్రయత్ని స్తోంది. ఓటింగ్‌ పరంగా పార్టీకి పట్టుందని, గతంలో పొత్తుల్లో దక్కిన ఏలూరును చివరి నిమిషంలో మార్చి జనసేనకు నష్టం చేకూర్చారని, అందుకే మేయర్‌ స్థానం ఇవ్వాలనే డిమాండ్‌ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన నేతలతో సంబంధం లేకుండా ఏలూరు నగరంలో డివిజన్ల పునర్విభజన స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగింది. దీంతో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు విభజన గందరగోళంగా జరిగిందని, సర్వే నంబర్లు, చెరువుల పేరుతో డివిజన్ల హద్దులు నిర్ణయించడం సరికాదని, కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మళ్లీ వివాదం రేగింది.

సీట్లు.. సిగపట్లు

ఏలూరు మేయర్‌ సీటు కోసం జనసేన పట్టు

అడ్డగోలుగా డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరం

ఉమ్మడి జిల్లాలో మూడు మున్సిపల్‌ చైర్మన్లు, ఒక నగర పంచాయతీ ఇవ్వాలని డిమాండ్‌

వార్డు కౌన్సిలర్లు, నగర కార్పొరేటర్ల సీట్లతో సరిపెడతామంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలు

ఉమ్మడి పశ్చిమలో కూటమి కుమ్ములాటలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement