చినవెంకన్నకూ ధరల భారమే! | - | Sakshi
Sakshi News home page

చినవెంకన్నకూ ధరల భారమే!

Sep 4 2026 2:36 AM | Updated on Sep 4 2026 2:36 AM

చినవెంకన్నకూ ధరల భారమే!

నిత్యాన్నదానానికి అందే కూరగాయల ధరలు ఇలా..

ఖర్చవుతున్న వడ్డీ సొమ్ము

ద్వారకాతిరుమల: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సెగ ద్వారకాతిరుమల చినవెంకన్నకు తగులుతోంది. ఇప్పటికే కూరగాయల ధరలు పెరగడంతో నిత్యాన్నదానంపై అదనపు భారం పడుతుండగా.. తాజాగా బియ్యం, పప్పులు, నెయ్యి, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా మార్కెట్‌లో మండిపోతున్నాయి. దీంతో స్వామివారి నిత్యాన్నదానం, నివేదనలు, ప్రసాదాల తయారీ తదితరాల నిర్వహణ వ్యయం మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. దేవస్థానానికి అవసరమైన నిత్యవసర వస్తువులను సరఫరా చేసేందుకు అధికారులు ఆరు నెలలకొకసారి ఈ–ప్రోక్యూర్‌మెంట్‌ టెండర్‌ను నిర్వహిస్తారు. అవసరమైన సరుకులను కోరిన పరిమాణంలో కాంట్రాక్టర్‌ అందించాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.

ప్రస్తుతం పాత ధరలకే సరఫరా

టెండర్‌ నిబంధనల ప్రకారం ప్రస్తుత కాంట్రాక్టర్‌.. మార్కెట్‌లో ధరలు పెరిగినా పాత టెండర్‌ ధరలకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. అయితే కొత్త టెండర్‌ ఖరారయ్యే సమయానికి మార్కెట్‌లో పెరిగిన ధరలు కచ్చితంగా ప్రతిబింబించే అవకాశం ఉంది.

కొత్త టెండర్‌పై ప్రభావం

మరో ఆరు నెలల పాటు నిత్యావసర వస్తువుల సరఫరా కోసం గతనెల 29న దేవస్థానం కొత్తగా ఈ–ప్రోక్యూర్‌మెంట్‌ టెండర్‌ను పిలిచింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త టెండర్‌దారు సరుకులను సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని టెండర్‌దారులు కోట్‌ చేసే ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే నిత్యావసర సరుకుల కొనుగోలు వ్యయం పెరిగి, దేవస్థానంపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

ప్రసాదాల తయారీకే ఖర్చు ఎక్కువ

స్వామివారి లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. పచ్చి సెనగపప్పు, పంచదార, బియ్యం, చింతపండు, యాలుకలు ధరలు ప్రస్తుతం మార్కెట్‌లో విపరీతంగా పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా రోజురోజుకి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కూరగాయల సరఫరా ఇలా..

దేవస్థానం టెండర్‌ షరతుల ప్రకారం కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ రైతు బజారులోని ధరలకంటే 25 శాతం తక్కువ ధరలకు వాటిని సరఫరా చేయాల్సి ఉంది. మార్కెట్‌ ధరలతో దేవస్థానానికి సంబంధం లేదు. రైతు బజార్‌లోని ధరలను చూసుకుని, కావాల్సిన పరిమాణాన్ని కాంట్రాక్టర్‌కు సూచిస్తే చాలు.. కూరగాయలు నిత్యాన్నదాన భవనానికి చేరుతాయి. అయితే గత పదిరోజులతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఆ భారం శ్రీవారిపైనే పడుతోంది.

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం అంబరుఖానాలో పులిహోర ప్రసాదాన్ని ప్యాకింగ్‌ చేస్తున్న మహిళా కార్మికులు

శ్రీవారి నిత్యాన్నదానానికి ట్రస్ట్‌ ఉండటంతో భక్తులు నిత్యం లక్షలాది రూపాయలను విరాళాలుగా అందిస్తున్నారు. వాటిని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, వచ్చిన వడ్డీతో దేవస్థానం అన్నదానాన్ని నిర్వహిస్తోంది. ధరల పెరుగుదల కారణంగా వడ్డీ సొమ్ము మరింతగా ఖర్చవుతోంది.

కూరగాయలతో పాటు సరుకుల ధరలకు రెక్కలు

నిత్యాన్నదానం, నివేదనలు, ప్రసాదాల తయారీపై ప్రభావం

నిత్యావసర వస్తువుల సరఫరాకు కొత్తగా పిలిచిన టెండర్‌

ప్రస్తుత ధరల ప్రభావం శ్రీవారిపై భారీగా చూపే అవకాశం

కూరగాయ రకం గతనెల ఈనెల

23 ధర 3 ధర

(కేజీ) రూ. (కేజీ) రూ.

టమాట 16.5 22.5

క్యారెట్‌ 33 36

దొండకాయలు 21 22.5

బంగాళ దుంపలు 19.5 21

ఉల్లిపాయలు 36 37.5

దోసకాయలు 15 18

కీరదోస 25.5 30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement