సైబర్‌ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

Sep 4 2026 2:36 AM | Updated on Sep 4 2026 2:36 AM

రూ.51.50 లక్షల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ

ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్‌

సైబర్‌ నేరంలో మోసపోయిన బాధితుడికి రికవరీ సొమ్ము అందజేత

ఏలూరు టౌన్‌ : అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ ఆశ చూపి మోసాలకు పాల్పడే సైబర్‌ కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ సూచించారు. సైబర్‌ మోసంలో భారీగా సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రికవరీ చేసిన డబ్బులను బాధితుడికి అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ప్రసాద్‌రావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, సైబర్‌ సెల్‌ సీఐ దాసు తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.67 లక్షలు టోకరా

కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామానికి చెందిన మల్లెంపల్లి జీవన్‌కుమార్‌కు వాట్సాప్‌ ద్వారా పరిచయమైన వ్యక్తులు ‘వీఎల్‌ బుక్‌’ పేరుతో ఒక లింక్‌ పంపారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం అతడిని గేమింగ్‌ బెట్టింగ్‌లోకి దింపి పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపించారు. ఇలా జీవన్‌కుమార్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ.67,67,888 కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు.

రూ.19.54 లక్షలు రికవరీ.. బాధితుడికి అందజేత

దర్యాప్తులో భాగంగా రికవరీ చేసిన రూ.19,54,600 నగదును జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. అలాగే, మోసపోయిన మొత్తంలో మరో రూ.16 లక్షల సొమ్మును వివిధ బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్‌ చేయించి, ఆ పత్రాలను బాధితుడికి అందించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ సొమ్మును కూడా బాధితుడు పొందేలా పోలీస్‌ అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

బెంగళూరు కేంద్రంగా మోసాలు.. 15 మంది నిందితుల గుర్తింపు

ఈ ఆన్‌లైన్‌ మోసానికి సంబంధించిన కేసులో మొత్తం 15 మంది నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులకు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) కింద నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. విచారణలో భాగంగా గణపవరం మండలం అర్థవరం గ్రామానికి చెందిన సాగిరాజు చైతన్య వర్మ అనే వ్యక్తి ‘వీఎల్‌ బుక్‌’ లింక్‌ పేరుతో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలో ఉన్నట్లు తేలింది. నిందితుడు బెంగళూరు నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయిందని ఎస్పీ వెల్లడించారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను భారీఎత్తున రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపారు. సెల్‌ఫోన్ల రికవరీలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 35 శాతం మాత్రమే ఉండగా.. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 80 శాతం రికవరీ సాధించామని ఆయన వెల్లడించారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు మొబైల్‌ ఫోన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2026 ఆగస్టు నెలలో భారీగా 206 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ.51.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేయగా.. మొత్తం 4,266 సెల్‌ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. ఇలా రికవరీ చేసిన సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ.10 కోట్ల 66 లక్షల 50 వేలు ఉంటుందని వివరించారు. ఎవరి ఫోన్లయినా చోరీకి గురైనా, పోగొట్టుకున్నా వెంటనే సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వై. ప్రసాద్‌రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌, సైబర్‌సెల్‌ సీఐ దాసు, ఏలూరు త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement