తణుకు అర్బన్ : దివ్యాంగుల వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దివ్యాంగులు గాయపడ్డారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఆర్వోబీవైపు నాలుగు చక్రాల దివ్యాంగుల వాహనంలో వస్తున్న ఇద్దరు దివ్యాంగులను వెనుకనుంచి వ్యాన్ ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన దివ్యాంగుడు మరపట్ల నరేష్ వ్యాన్ చక్రాల మధ్యకు వెళ్లిపోగా మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొల్లాటి వెంకటేశ్వరరావు పక్కకు ఎగిరిపడ్డారు. తక్షణమే ప్రయాణికులు వ్యాన్ టైర్ల మధ్య నుంచి నరేష్ బయటకు లాగారు. పోలియోతో ఉన్న నరేష్‌కు తిరిగి రెండు కాళ్లకు గాయాలుకాగా, వెంకటేశ్వరరావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడిపారని అందుచేతనే వాహనాన్ని అదుపుచేయలేక ఎదురుగా వెళ్తున్న దివ్యాంగుల మోటారుసైకిల్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి ఆ ప్రాంతం నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం ద్వారా క్షతగాత్రులను తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఉచితంగా ఇస్తున్న నేపధ్యంలో తణుకు వచ్చామని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సరుకులు తీసుకుని తిరుగు ప్రయాణంలో ఇలా జరిగినట్లు దివ్యాంగులు తెలిపారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


