ఏలూరు (టూటౌన్): పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వైఫల్యం చెందాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, నగర కార్యదర్శి పంపన రవికుమార్ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పచ్చగడ్డి తింటూ రెండు చెవుల్లో పువ్వులు పెట్టుకుని ధర్నా నిర్వహించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడికి ఉల్లిపాయలు సైతం ఒక ఖరీదైన వస్తువుగా మారిపోయాయని తెలిపారు. ఈ నిరసనలో భాగంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎస్. సత్యనారాయణ, గడిగంటి కోటేశ్వరరావులకు ఉల్లిపాయల దండలు వేసి సత్కరించి, ప్రభుత్వ తీరును వినూత్నంగా ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా డీఎన్వీడీ ప్రసాద్, పంపన రవికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో పంచదార రూ.72, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.180, వేరుశనగ నూనె రూ.190, బెల్లం రూ.90, కందిపప్పు రూ.120, గ్యాస్ సిలిండర్ రూ.1,000కి పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో ఉల్లిపాయలు సైతం కిలో రూ.60 పలుకుతున్నాయని చెప్పారు. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ఈ దౌర్భాగ్య పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు వైఎస్. కనకారావు, మంచెల్ల ఇస్సాకు, తమ్మినేని అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.


