అడుగంటిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన ఆశలు

Sep 4 2026 2:36 AM | Updated on Sep 4 2026 2:36 AM

అడుగంటిన ఆశలు

రబీ సాగు కష్టమే

జలాశయాల్లో నీరు తక్కువ

బుట్టాయగూడెం: రిజర్వాయర్ల పరిధిలో ఈ ఏడాది పంట సాగు అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. సెప్టెంబర్‌ మొదటి వారం దాటుతున్నా వరుణుడి జాడ లేకపోవడంతో రైతుల ఆశలు అడుగంటుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలో సుమారు 32 వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకూ వ్యవసాయ బోర్లు ఉన్న ప్రదేశాల్లో కేవలం వెయ్యి ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

పూర్తిగా తగ్గిన జల్లేరు నీటిమట్టం

బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. ఈ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 217.80 మీటర్లు కాగా, ప్రస్తుతం 211.50 మీటర్ల మేర మాత్రమే నీరు ఉంది. ఈ జలాశయం నీటిపై ఆధారపడి 4,200 ఎకరాల ఆయకట్టు కింద రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను పండిస్తుంటారు. అయితే ఖరీఫ్‌ సాగుకు ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో అనేకమంది రైతులు పొలాలను బీడుగా వదిలేశారు. ప్రస్తుతం నీటిమట్టం 211.50 మీటర్లుగా ఉండడంతో ఈ నీరు కేవలం 200 ఎకరాలకు మాత్రమే సరిపోతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో దొరమామిడి, తెల్లంవారిగూడెం, దుద్దుకూరు, ముప్పినవారిగూడెం, శ్రీరామపురం, కోటనాగవరం పరిసర ప్రాంతాల్లోని రైతులకు ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది.

పోగొండ రిజర్వాయర్‌లోనూ అదే పరిస్థితి

బుట్టాయగూడెం మండలంలోని చింతలగూడెం సమీపంలో నిర్మించిన పోగొండ రిజర్వాయర్‌ పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఈ రిజర్వాయర్‌ పూర్తి నీటి మట్టం 157 మీటర్లు కాగా, ప్రస్తుతం 152.5 మీటర్లు మాత్రమే నీరు ఉంది. ఈ రిజర్వాయర్‌ పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో గిరిజన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుండగా.. ఇక్కడి నుంచి విడుదలయ్యే నీటి ద్వారా బందకట్టు, ఆయకట్టు రైతులు మరో 3,652 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. అయితే వర్షాలు లేక నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఇక్కడ కూడా ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది.

పెద్దవాగు ప్రాజెక్టులోనూ లేని నీరు

పెద్దవాగు ప్రాజెక్టు ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 11,388 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. అయితే గత ఏడాది వరదలకు ఈ ప్రాజెక్టు గట్టు కొట్టుకుపోవడంతో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా అడుగంటింది. దీంతో ఇక్కడ కూడా సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో తుఫానులు ఏర్పడి ఏవైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్‌లో వ్యవసాయం చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు.

నిండని చెరువులు

నియోజకవర్గంలో సుమారు 128 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల పరిధిలో 30 వేలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. వీటి కింద రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఇప్పటివరకూ ఈ చెరువుల కింద కేవలం 1,100 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ భూములన్నీ పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువులోనూ నీరు లేక, ఆయకట్టు రైతులు పంటల సాగుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుట్టాయగూడెం మండలం జల్లేరు జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉన్న దృశ్యం

చిన్నజీడిపూడి సమీపంలో పంటలు వేయకుండా ఖాళీగా ఉంచిన సాగు భూమి

జలాశయాల్లో తగ్గిన నీటిమట్టం

ప్రశ్నార్థకంగా రబీసాగు

దిక్కుతోచని స్థితిలో రైతులు

నియోజకవర్గంలో సుమారు 32 వేల ఎకరాలకు నీటి సమస్య

ప్రస్తుతం 12 వేల ఎకరాల్లోనే ఖరీఫ్‌ సాగు

ఈ ఏడాది వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా రబీలో జల్లేరు జలాశయం నుంచి వచ్చే నీటి ద్వారా మొక్కజొన్న, వరి వంటి పంటలు పండిస్తున్నాం. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. జలాశయంలో నీటి మట్టం తగ్గడంతో మా భూములకు నీరు వచ్చే అవకాశం లేదు.

– తెల్లం భీమరాజు, రైతు, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం

ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడం వల్ల జలాశయాల్లో నీటి మట్టం బాగా తగ్గాయి. జల్లేరు జలాశయంలో ఉన్న నీరు కేవలం 200 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. పోగొండ రిజర్వాయర్‌, పెద్దవాగు ప్రాజెక్టుల్లోనూ తగినంత నీరు లేని పరిస్థితి ఉంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వర్షాలు కురిస్తే జలాశయాలు నిండుతాయనే ఆశతో ఉన్నాం.

– టి. సురేష్‌, ఎంఐ ఏఈ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement