యలమంచిలి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఐవీవీ స త్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జి ల్లాలోని ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రతిఒక్కరూ తమ వాట్సాప్ ప్రొఫైల్ డీపీగా ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అనే వాక్యాన్ని ఉంచి తమ నిరసనను తెలియజేశారు. ఉద్యోగ నాయకులు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి, కరపత్రాలను పంపిణీ చేశారు. తాము ఈ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ఉద్యోగులకు వివరించారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ రాజు, జేఏసీ జనరల్ సెక్రటరీ అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్‌పర్సన్ సుగుణ సంధ్య, పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


