బుట్టాయగూడెం: పొలంలో కట్టేసిన మూడు గిత్తలు, రెండు ఆవులపై ఆదివారం రాత్రి పిడుగుపడి ఐదు పశువులు మృతి చెందిన సంఘటన బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన ఇనుమూరులో జరిగింది. బాధిత రైతు చీమల ముత్యాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మేతకు వెళ్లి తిరిగొచ్చిన ఐదు పశువులను గ్రామ సమీపంలోని తమకున్న ఎకరం పొలం మధ్యలో కట్టేసినట్లు తెలిపారు. అర్ధరాత్రి తీవ్రమైన ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చిందని చెప్పారు. తెల్లవారుజామున పాలు తీసేందుకు వెళ్లి చూడగా అవన్నీ మృతిచెంది ఉన్నట్లు పేర్కొన్నారు. ముత్యాలరావుకు చెందిన రెండు గిత్తలు, ఒక ఆవు, పాయం పాపారావుకు చెందిన పాలిచ్చే ఆవు, కారం సింగరాజుకు చెందిన రెండు గిత్తలు మృతి చెందినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ... పిడుగుపాటుతో మృతి చెందిన పశువుల యజమానులకు ఒక్కొక్క పశువుకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


