కొయ్యలగూడెం: రాజవరం (గంగవరం) మెట్ట కొండపై నుంచి గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సర్వే నంబరు 207 కొండగుట్టను జేసీబీలు, టిప్పర్ లారీలు పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర కిందట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిరోధించాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రజలు పేర్కొంటున్నారు. భారీగా కొండను తవ్వడం పర్యావరణానికి చేటుగా మారిందని వాపోతున్నారు. అధికారులు పలుమార్లు దాడులు చేసి అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నప్పటికీ, అవి నామమాత్రమే.. రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. సుమారు వెయ్యి టిప్పర్లకు పైగా గ్రావెల్ మట్టి రవాణా అయిందని, పరిసర ప్రాంతాలలోని టిప్పర్లు, జేసీబీల యజమానులే ఈ గ్రావెల్ దందాకు మూలకారణమని అంటున్నారు. గంగవరం, రాజవరం గ్రామాలు అక్రమాలకు అడ్డాగా నిలిచాయనేది వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. పొట్టి మెట్ట కొండగా పిలవబడే ప్రాంతం నుంచి కేవలం రెండు సంవత్సరాల కాలంలో రూ. 10 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ తవ్వకాలు జరిగాయన్నారు.
వేళల్లో అక్రమ తోలకాల వల్ల అంతర్గత రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని, నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లు సైతం గోతులమయమయ్యాయని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రావెల్ తోలకాలు ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోగా, తాము ఏవిధమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తుండటంపై ప్రభుత్వ శాఖల పట్ల విశ్వసనీయత కోల్పోతున్నామని ప్రజలు తెలిపారు. అధికారుల చర్యలు అక్రమ తోలకాలను నిరోధించలేనప్పుడు, ప్రభుత్వ తీరును ప్రశ్నించడంతో పాటు అక్రమార్కుల దందాకు వెనుక ఉండి కొమ్ముకాస్తున్నది ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నామమాత్రపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రజలు భావిస్తున్నారు.
లింగపాలెం మండలంలో
లింగపాలెం: లింగపాలెం మండలంలోని వివిధ చెరువుల నుంచి మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని సుమారు 10 గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువుల నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీగా మట్టిని తరలిస్తున్నారు. ముఖ్యంగా పాశ్చానగరం చెరువుతో పాటు ఇతర ప్రాంతాల్లో నిత్యం అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెరువుల్లో ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద గోతులు తీస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ట్రాక్టర్లు బయటకు వెళ్లేందుకు చెరువు గట్లను నరికివేసి బాటలు ఏర్పాటు చేస్తుండటంతో, వర్షాలు వచ్చినప్పుడు చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.
అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.


