విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం

Jul 28 2026 11:32 AM | Updated on Jul 28 2026 11:32 AM

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం బస్సు ఢీకొని మహిళ మృతి యోగాలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సత్తా రూ.లక్ష పోగొట్టుకున్న భక్తుడు

టి.నరసాపురం: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెడ్లం పంచాయతీ శ్రీరామవరం గ్రామానికి చెందిన చవల అప్పారావు (43) సోమవారం ఉదయం తాను కౌలుకు తీసుకున్న ఆయిల్‌పామ్‌ తోటలోని మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. ఈ క్రమంలో పాత బోరు నుంచి కొత్త బోరు వరకు వేసిన కేబుల్‌ వైరు నీళ్లు పెట్టడానికి అడ్డురావడంతో, దానిని ఒక పైపు ముక్కతో పక్కకు తప్పించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ కేబుల్‌ వైరు, ప్లాస్టిక్‌ ముక్క చాతీపై పడటంతో తీవ్ర విద్యుత్‌ షాక్‌కు గురై అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టి.నరసాపురం ఎస్‌ఐ ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తణుకు అర్బన్‌: తణుకు మండలం తేతలి వై జంక్షన్‌ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. తాడేపల్లిగూడెం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పెచ్చెట్టి సత్యవతి (55), ఆమె భర్త బాషా దంపతులు ఆదివారం తణుకు మండలం మహాలక్ష్మిచెరువులో ఉంటున్న తమ కుమార్తెను పరామర్శించేందుకు వచ్చారు. సోమవారం ఉదయం బాషా తన భార్యతో కలిసి బైక్‌ఫై ఏలూరులోని మిలిటరీ కార్యాలయానికి బయలుదేరారు. తేతలి వై జంక్షన్‌ సమీపంలో కళాశాల బస్సు ఢీకొట్టింది. సత్యవతి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బాషాకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తణుకు రూరల్‌ ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నూజివీడు: ఏలూరులో ఈ నెల 26న నిర్వహించిన భారత్‌ యోగా చాంపియన్‌షిప్‌లో ఆర్జీయూకేటీకి చెందిన నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపి 9 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు సాధించారు. విద్యార్థులు ఆర్టిస్టిక్‌ సోలో, ఆర్టిస్టిక్‌ పెయిర్‌, రిథమిక్‌ పెయిర్‌, ట్రెడిషనల్‌ యోగాసన విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో డీ.దేవిశ్రీ, డి. యుగంధర్‌ రెండేసి స్వర్ణ పతకాలు, జి.గీతిక, కె. భావన, బి.భావన, ఎన్‌.చరణ్‌, బి.ముకేశ్‌, డి. దామోదర్‌, ఎమ్‌.దివాకర్‌ ఒక్కో స్వర్ణం సాధించారు. కె.హరిత, జి.యమున, వై.స్పందన, పి.తనూష రజత పతకాలు సాధించారు. సాధించారు. ఈ విజయంపై ఆర్జీయూకేటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. యోగా అధ్యాపకులు చంద్రశేఖర్‌ను అభినందించారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తన వద్ద ఉన్న రూ.లక్ష నగదును పోగొట్టుకున్న సంఘటన ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై టి. సుధీర్‌ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25న భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు వచ్చాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదును తన ప్యాంటు జేబులో పెట్టుకుని తీసుకొచ్చాడు. శ్రీవారి దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలుదేరాడు. ప్యాంటు జేబులో నగదు లేదని గుర్తించి, గుర్తుతెలియని వ్యక్తులు జేబులోని డబ్బును దొంగిలించినట్లు సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement