నూజివీడు: ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్‌ఐటీల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా వేస్తున్న డిప్యుటేషన్లపై ఫ్యాకల్టీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలుండగా మిగులు అధ్యాపకులు ఎక్కడైనా ఉంటే వారిని అవసరమైన చోటకు పంపుతారు. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా, పాఠశాలల్లోనైనా, కళాశాలల్లోనైనా జరిగేది ఇదే. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా డిప్యుటేషన్లు వేస్తున్నారు. అక్కడ అవసరం ఉన్నప్పటికీ శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో పనిచేసే ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచిలకు ముగ్గురు మహిళా ఫ్యాకల్టీని నూజివీడు ట్రిపుల్ ఐటీకి గతేడాది డిప్యుటేషన్‌పై నియమించారు. వీరి స్థానంలో ఎవరో ఒకరికి వర్క్‌లోడు ఎక్కువ వేసి పని చేయిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఫ్యాకల్టీని అకడమిక్ ఇయర్ ప్రారంభంలో ఒంగోలు ట్రిపుల్‌ఐటీకి డిప్యుటేషన్‌పై పంపారు. వారిరువురు పదిరోజులు కూడా అక్కడ విధులు నిర్వహించకుండా తిరిగి నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చేశారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో నూజివీడు ట్రిపుల్ ఐటీకి అంతుబట్టడం లేదు.
నలుగురు ఫ్యాకల్టీకి డిప్యుటేషన్ ఉత్తర్వులు
ఈ వ్యవహారంపై ట్రిపుల్‌ఐటీలోని అధ్యాపకుల మధ్య చర్చ సాగుతుండగానే యూనివర్సిటీ అధికారులు ఈసీఈ చెందిన నలుగురు పురుష ఫ్యాకల్టీని ఒంగోలు ట్రిపుల్ ఐటీకి డిప్యుటేషన్‌పై నియమించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఈ నలుగురు ఫ్యాకల్టీకి సరిపడా వర్కులోడు ఉన్నప్పటికీ, మూడు వారాలుగా క్లాసులకు వెళ్లి బోధన చేస్తున్న సమయంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి డిప్యుటేషన్‌పై వెళ్లాలంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై స్థానిక ఫ్యాకల్టీలో విస్మయం వ్యక్తమవుతోంది. ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో ఫ్యాకల్టీ లోటు ఉన్నప్పుడు అక్కడ నియమించిన ఇద్దరు మహిళా ఫ్యాకల్టీని 10 రోజులు గడవకుండానే తిరిగి నూజివీడుకు డిప్యుటేషన్‌పై ఎందుకు పంపారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి యూనివర్శిటీ అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నలుగురు ఫ్యాకల్టీలో చుండ్రు ప్రవీణ్‌కుమార్, వెంపటి శేఖర్‌ను మొదటి సెమిస్టర్‌కు, పున్నపు సురేష్, లంకపల్లి బాబూరావులను రెండో సెమిస్టర్‌కు ఒంగోలు వెళ్లాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా అనేక నిర్ణయాలు ఇష్టారాజ్యంగా తీసుకుంటూ ఆర్జీయూకేటీ ఎప్పుడూ వివాదాల్లో ఉండేలా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ట్రిపుల్‌ఐటీల ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళన ఫ్యాకల్టీలో వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఆర్జీయూకేటీ చాన్సలర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించి వివాదాస్పద నిర్ణయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
డిప్యుటేషన్లపై తీవ్ర వ్యతిరేకత


