బుట్టాయగూడెం: ఏజెన్సీలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీఓ నంబర్ 3 తరహా జీఓను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం ఐటీడీఏను ముట్టడించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు పోరంట్ల శ్రీనివాస్, కారం రాఘవలు మాట్లాడుతూ.. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70, పీసా చట్టాల అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఏజెన్సీలో విద్య, వైద్యం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. మోతుగూడెంకు చెందిన చిన్నారి రిత్విక అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే సరైన వైద్యం అందక మృతిచెందిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను యూపీ పాఠశాలలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి, ఇటుకులకోట, లంకపాకల పాఠశాలలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ ఏపీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్. రామ్మోహన్‌రావు, పీఓఎల్ నాయకులు తగరం బాబూరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు వెట్టి భారతి, న్యాయవాది యు.ఏసుబాబు, పీడీఎస్‌యూ నాయకులు బన్నే వినోద్, ఈ.భూషణం తదితరులు పాల్గొన్నారు.


