ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలి
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంత గిరిజన గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల వల్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల బెడ్‌లు సరిపోక బల్లలపై, నేలపైనే చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. టైఫాయిడ్, మలేరియా కేసులు తీవ్రమవ్వడంతో పాటు రోగులలో ప్లేట్‌లెట్స్ కూడా పడిపోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
313 మలేరియా కేసులు నమోదు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో 313 మలేరియా కేసులు నమో దయ్యాయి. వీటిలో 306 ఏజెన్సీ పరిధిలోనే నమో దు కాగా, 7 కేసులు వెలుపలి ప్రాంతాలకు చెందినవి. ఈ ప్రాంతంలో దాదాపు 220 గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా మొదటి విడత స్ప్రేయింగ్ పనులు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి.
దోమ తెరల పంపిణీ ఊసేలేదు
సాధారణంగా మలేరియా కట్టడికి మలాథియాన్ స్ప్రేయింగ్‌తో పాటు దోమతెరలను పంపిణీ చేస్తుంటారు. గతంలో (2021లో) వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 2,50,000 దోమతెరలను అందజేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయకపోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఉచితంగా దోమతెరలు పంపిణీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.
అంతర్వేదిగూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో జ్వర పీడితులు
మంచం పట్టిన మన్యం
విజృంభిస్తున్న జ్వరాలు
ఈ ఏడాదిలో 313 మలేరియా కేసులు
జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట
ఇప్పటికీ పంపిణీ కాని దోమ తెరలు
ఏజెన్సీ ప్రాంతంలోని గ్రా మాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రతి ఇంట్లో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. ఆస్పత్రులు కూడా నిండిపోయి కిటకిటలాడున్నాయి. గ్రామంలోనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేలా కృషి చేయాలి.
– కారం రాఘవ, ఏఐకేఎమ్‌ఎస్ నాయకులు, అలివేరు, బుట్టాయగూడెం మండలం
ఈ ఏడాది సరైన వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. మోతుగూడెంకు చెందిన రిత్విక అనే చిన్నారి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక మృతి చెందగా, ఇటీవల పులిరామన్నగూడెంకు చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత మలేరియాతో ప్రాణాలు విడిచింది.


