ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆహాకారం | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆహాకారం

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

మాయమైన ప్రొటీన్‌ ఆహారం

నూజివీడు: ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అంటారు. అలాంటి ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటగది సాధారణంగా ఎక్కడా ఉండదు. రోగనిరోధక శక్తిని పెంచి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇవేమీ ఉపయోగించకుండా వంటలు చేస్తుండటంతో నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు రుచీపచీ లేని ఆహారాన్ని తినలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నామినేషన్‌ పద్ధతిలో మెస్‌ కేటాయింపు

నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని 8,800 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే బాధ్యతను ఎలాంటి టెండర్లు పిలవకుండానే ఏకపక్షంగా, నామినేషన్‌ పద్ధతిలో హరేకృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌కు మూడేళ్ల కాలపరిమితితో అప్పగించారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.110 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని, 2025 దసరా సెలవుల అనంతరం నుంచి ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెస్‌ నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఉన్న కాంట్రాక్టర్లకు రోజుకు రూ.88 మాత్రమే చెల్లించేవారని, ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఇచ్చినా ఆహార నాణ్యతలో ఎలాంటి మార్పూ లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం సరిగా ఉడకకపోవడమే కాకుండా తరచూ దుర్వాసన వస్తోందని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిందామంటే తిండి లేదు

ఉదయాన్నే ఇచ్చే అల్పాహారంలో ఒక్క ఇడ్లీ తప్ప మిగతావేవీ తినేలా ఉండటం లేదు. గారెలు, పునుగులు చేదుగా ఉండి, చల్లారితే రాతిలా గట్టిపడుతున్నాయి. అట్లు కూడా రుచిగా ఉండటం లేదు. కూరగాయలతో చేసే వంటకాలను అతిగా డీప్‌ ఫ్రై చే స్తుండటంతో తినలేకపోతున్నారు. ఉల్లి, వెల్లుల్లి అ సలే వాడకపోవడంతో వంటకాలకు రుచి ఉండటం లేదు. దీంతో వేరే దారి లేక విద్యార్థులు పెరుగన్నంతోనే కడుపు నింపుకుంటున్నారు.

రుచీపచీ లేని భోజనం

అల్పాహారం అంతంతమాత్రమే..

ఉల్లి, వెల్లుల్లి వాడకుండానే కూరలు

గుడ్డు, చికెన్‌ అందించని వైనం

ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆవేదన

వేసవి సెలవుల అనంతరం జులై 1న తరగతులు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు గుడ్డు కానీ, చికెన్‌ కానీ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. గంలో వారంలో 5 రోజులు కోడిగుడ్డు, 2 రోజులు చికెన్‌ ఇచ్చేవారు. నూతన యాజమాన్యం వచ్చాక దానిని 4 రోజుల గుడ్డు, ఒక రోజు చికెన్‌కు కుదించారు. అయితే ప్రస్తుతం ఇవేమీ అందించడం లేదు. అయినా నెలాఖరున మెస్‌ బిల్లులు వసూలు చేసేటప్పుడు మాత్రం నాన్‌వెజ్‌తో కలిపే చార్జి చేస్తారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉల్లి, వెల్లుల్లితో కూడిన నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటు మెనూ ప్రకారం కోడిగుడ్డు, చికెన్లను రోజూవారీగా సక్రమంగా అందించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement