భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా కె.ఆర్.కల్పశ్రీ శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఆమెను కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.ప్రభాకర్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి.మోహన్ రాజు, కలెక్టరేట్ ఎ.ఓ. వెంకటే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉండి: జిల్లాలో రెండు ప్రభుత్వ, 16 ప్రైవేటు కాలేజ్‌లకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 11:30 గంటల నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. శుక్రవారం మొదటిరోజు 57 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా వారిలో 49 మంది మాత్రమే హాజరు కాగా వారు జిల్లా వ్యాప్తంగా వున్న ఐటీఐలలోని వివిధ ట్రేడ్‌లలో సీట్లు పొందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు శని,ఆదివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వారు తెలిపారు.
పెనుగొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు నెమ్మదిగా చేరుతుంది. ఇటీవల మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో ఎగువ నుంచి నీరు భారీగా చేరుతుంది. దీంతో దొంగరావిపాలెం, సిద్ధాంతం, నడిపూడి, పెదమల్లం, కోడేరు, అయోధ్యలంక, భీమలాపురంలో ఇసుక తిన్నెలు నెమ్మదిగా నీట మునుగుతున్నాయి. మరో వారంలో గోదావరికి ఎర్రనీరు పోటెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాడేపల్లిగూడెం: అఖిల భారత ఇంజనీరింగ్ సాంకేతిక సంస్థ(ఏఐసీటీఈ) గ్రాడ్యుయేట్ విద్యా మండలి సభ్యుడిగా ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.రమణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. దేశంలోని ఇంజనీరింగ్ విద్యను మరింత నాణ్యంగా, సమర్ధవంతంగా తీర్చిదిద్దడంలో ఈ మండలి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫలితాల ఆధారిత బోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, నవకల్పన, పారిశ్రామిక అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తానన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గతేడాది ఆగస్టు 24న నిర్వహించిన టీటీసీ పరీక్షలకు సంబంధించిన మార్కుల జాబితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్కుల జాబితాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాలకు పంపించారని తెలిపారు. అభ్యర్థులు మూడు వారాల్లోగా వారి హాల్ టిక్కెట్లు చూపించి మార్కుల జాబితాలు పొందవచ్చని తెలిపారు. గత మే నెలలో జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయని తెలిపారు.
జంగారెడ్డిగూడెం: కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సహకార సంఘాల జాతీయ డేటా బేస్ ర్యాంకుల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం సహకార సంఘం ప్రతిభ కనబరిచింది. అన్ని విభాగాల్లో కలిపి 65.25 శాతం స్కోరు సాధించి రాష్ట్రంలోనే 9వ స్థానంలో, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు సంఘ చైర్‌పర్సన్ గంధం గోపాలకృష్ణ, సీఈఓ సర్వేశ్వరరావు, సిబ్బందికి జిల్లా సహకార యూనియన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


