ఏలూరు టౌన్: శిక్షణ పొందిన కోర్సులో నైపుణ్యం సాధించింది. సొంతంగా తన కాళ్లపై నిలబడి, కుటుంబానికి అండగా ఉండాలని అడుగులు వేస్తున్న యువతి ఆశలు ఆవిరయ్యాయి. వివరాల ప్రకారం ఏలూరు వన్‌టౌన్ ఏసుపాదపురానికి చెందిన వంజరపు మనోజ (24) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన మనోజ ఏలూరు వన్‌టౌన్‌లోని కన్నయ్య పార్క్ వద్ద ఓ భవనంలో బోటిక్ షాపును ప్రారంభించేందుకు పూనుకుంది. శుక్రవారం ఉదయం బోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సామగ్రి అంతా కొనుగోలు చేసింది. అలాగే షాపు ఓపెనింగ్‌కు సంబంధించి భవనం మొదటి అంతస్తు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తోన్న తరుణంలో సమీపంగా వెళ్తున్న విద్యుత్ వైర్లకు ఫ్లెక్సీ ఐరన్ పైప్ తగలడంతో విద్యుత్‌షాక్‌తో సంఘటనా స్థలంలోనే మనోజ మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏలూరు వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు.


