భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా డీపీఆర్వోగా టి.మోహన్ రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు.
భీమవరం: విశాఖపట్నం గంభీరగెడ్డ రిజర్వాయర్‌లో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్‌రాష్ట్ర కనోయింగ్ అండ్ కయాకింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భీమవరం బీవీ రాజు డిగ్రీ కళాశాల విద్యార్థిని వనమాడి మౌనిక రెండు కాంస్య పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణంరాజు చెప్పారు. సోమవారం పతకాలు సాధించిన మౌనికను అభినందించిన సందర్భంగా ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 4న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాప్ సహకారంతో పోటీలు జరిగాయన్నారు.
భీమవరం: ప్రజా కళలను కళాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు తీవ్రంగా విమర్శించారు. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. ప్రజా నాట్యమండలి ఎంతోకాలంగా ప్రజల కష్టసుఖాలను పాటలుగా వీధి నాటకాలుగా తయారుచేసి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రభుత్వాలు కళాకారులను పట్టించుకోవడంలేదని గుర్తింపు కార్డులు, ఇతర ప్రోత్సాహకాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి చైతన్య ప్రసాద్ అధ్యక్షత వహించగా గోదావరి సాహితీ స్రవంతి కన్వీనర్ శ్రీనివాసరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి వాసుదేవరావు, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వల్లి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన బాధితులు సోమవారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలిసి ఆవేదనను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద ఉన్న బంగారు తాకట్టు ఆభరణాల ఒరిజినల్ రసీదులను తీసుకుంటున్నారని, భవిష్యత్తులో ఒరిజినల్ రసీదులు లేకపోతే రేపు బ్యాంకు నుంచి నగలు విడిపించుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని తమ అనుమానాలను ఏఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. కేసును త్వరితగతిన ఛేదించడానికి, దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే ఒరిజినల్ రసీదులను సేకరిస్తున్నామని, ఇవి కేసులో చాలా కీలకమని స్పష్టం చేశారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రసీదులు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ పోలీసుల తరఫున గ్యారెంటీగా అక్‌నాలెడ్జ్‌మెంట్ పత్రం ఇస్తామని చెప్పారు. తామే స్వయంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.


