అమ్మకానికి సర్కారీ కొలువులు | - | Sakshi
Sakshi News home page

అమ్మకానికి సర్కారీ కొలువులు

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

సిఫార్సు పత్రాలు

న్యూస్‌రీల్‌

సిఫార్సు పత్రాలు

ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: ‘మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం కావాలా?.. ఎస్సై ఉద్యోగం కావాలా?.. సివిల్‌ సప్లయిస్‌ డిపార్ట్‌మెంట్‌లోనా.. కలెక్టరేట్‌లోనా..’ ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సర్కారు కొలువుల పేరిట కొందరు కూటమి నేతలు నిరుద్యోగులకు వలవేసి రూ.3 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో గత పది నెలల కాలంగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. సొమ్ములు చెల్లించి నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. తెలిసిన వారి వద్ద తమ ఆవేదన చెబుతుండటంతో ఈ విషయం వెలుగుచూస్తోంది. అత్తిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొందరు నేతలు ప్రభుత్వంలో తమకున్న పలుకుబడితో పోలీస్‌, రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌, రవాణా, కలెక్టరేట్‌ కార్యాలయం, తదితర ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించినట్టు సమాచారం. విద్యార్హతను బట్టి కాసులు కుమ్మరించగలిగితే ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ఏరియాల్లో ఆయా ఉద్యోగాల్లో కూర్చోబెడతామని నమ్మించి ఉద్యోగ స్థాయిని బట్టి రూ. 3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగాను ఉద్యోగాలు ఇస్తామని నమ్మించినట్టు చెబుతున్నారు. తమ పిల్లలకు సర్కారు కొలువు దొరుకుతుందన్న ఆశతో కొందరు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి సదరు నేతల చేతిలో పెట్టారంటున్నారు. అత్తిలి మండలంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది వరకు రూ.3 కోట్ల మేర వారికి కుమ్మరించినట్టు తణుకులో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఉద్యోగాల కోసం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతస్థాయి నుంచి స్థానిక అధికారులకు సిఫార్సు చేస్తున్నట్టుగా ఉన్న పత్రాలను సొమ్ములు ఇచ్చిన వారికి అందజేసినట్టు సమాచారం. శిక్షణ పేరిట గత ఏడాది కొందరిని ఏలూరు తీసుకువెళ్లి పలు కార్యాలయాల్లో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ఏడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సదరు నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు ఉద్యోగం వద్దని, తాము చెల్లించిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు పేరు చెప్పేందుకు నిరాకరించిన బాదితుడు ఒకరు తెలిపారు. అధికార కూటమిలో స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు కావడంతో ఏ విధమైన ఆధారాలు లేకుండానే రూ.లక్షలు తీసుకువెళ్లి వాళ్ల చేతిలో పోశామన్నారు. ఉన్నతస్థాయిలో వారికి చెల్లించామని, అవి రావాల్సి ఉందని రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారని అంటున్నారు. బాదితులంతా చిన్నస్థాయి వారు కావడంతో ఈ విషయం బయటపెడితే ఉద్యోగం మాట ఎలా ఉన్నా తమ డబ్బులు తిరిగిరావన్న ఆందోళనతో ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా ఈ వ్యవహారం బయటకు పొక్కుతుండటంతో సదరు నేతలు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు సమాచారం. ఉద్యోగాలు వద్దు.. మా సొమ్ములు మాకు తిరిగి చెల్లించమని ఒత్తిడి తెస్తున్న ముగ్గురికి తిరిగి సొమ్ములు చెల్లించినట్టు తెలుస్తోంది.

నిరుద్యోగ యువతకు తణుకులో కూటమి నేతల ఎర

ఉద్యోగాల పేరిట రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు

దాదాపు 50 మంది నుంచి రూ.3 కోట్ల వసూళ్లు!

మంత్రులు, ఐఏఎస్‌ అధికారుల పేరిట సిఫార్సు లేఖలు

పది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement