కార్యకర్తలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

కాళ్ల: చంద్రబాబు పాలనలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. కాళ్ళ మండలం పెదఅమిరంలో పదవీ విరమణ చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సర్పంచులకు సత్కార కార్యక్రమం నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ సర్పంచులుగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ సెంటర్లను తీసుకొచ్చి వలంటీర్‌ వ్యవస్థతో గ్రామాల్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కూటమి పరిపాలనలో రెండేళ్లు సర్పంచ్‌లకు ప్రోటోకాల్‌ కూడా లేకుండా చేశారన్నారు.

కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య, జెడ్పీటీసీలు రణస్తుల మహంకాళి, వేగేశ్న వెంకట రాజు, ఆకివీడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జామి హైమా వతి మాట్లాడారు. పదవీ విరమణ చేసిన సర్పంచులు, ఉప సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ రాజు, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి రాజు, ఉండి మండల అధ్యక్షుడు ఆంజనేయరాజు, పాలకోడేరు మండల అధ్యక్షులు పాపారావు, ఆకివీడు పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ పాల్గొన్నారు.

ఉండి నియోజవర్గంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతో ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే సంపద సృష్టిస్తాం, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తారని అనుకుంటారని, ఉండి నియోజకవర్గంలో మాత్రం దాని విరుద్ధంగా నడుస్తుందన్నారు. ఇప్పుడు అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధానిగా చేస్తానని చెబుతున్నారని.. రాజధాని నిర్మాణానికి రూ. 10 లక్షల కోట్లు ఉంటే తప్ప పూర్తి కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారన్నారు. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ మూడు ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మావిగన్‌ను జగన్‌ సూచించారని, కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నరసింహరాజు మాట్లాడుతూ కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా కట్టుబడి ఉన్న సర్పంచులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదని, ఒక్క పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇళ్లు పడగొట్టడం వంటివి చేశారని, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలని కోరారు.

కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు

ఉండి నియోజకవర్గంలో భయపడే పరిస్థితి తీసుకొచ్చారు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement