హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు 36 శాతం ఐఆర్‌ మంజూరు చేయాలి క్షేత్రంలో భక్తుడికి పాము కాటు తెలుగు మహాసభల సమన్వయకర్తగా రమావతి

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం రాత్రి కొందరు హిజ్రాలకు ఎస్సై టి.సుధీర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి క్షేత్రంలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 5న ‘సాక్షి’లో ‘శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీస్‌ అధికారులు స్పందించారు. శనివారం రాత్రి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో హిజ్రాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 15 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా టవేరా కారులో కొండపైకి వెళుతున్న 10 మంది హిజ్రాలను ఎస్సై టి.సుధీర్‌ సిబ్బందితో కలిసి టోల్‌గేటు వద్ద అడ్డుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసి, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు. క్షేత్రంలో జరిగే పెళ్లిళ్లకు వెళ్లడానికి ఇక వీల్లేదన్నారు. కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎం.రవికుమార్‌ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, 36 శాతం ఐఆర్‌ మంజూరు చేయాలని, పాత పెన్షన్‌ పద్ధతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం సాయంత్రం ఓ భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడకు చెందిన ఆర్‌అండ్‌బి ఉద్యోగి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం క్షేత్రానికి విచ్చేశాడు. ఆదివారం ఉదయం నిత్యకల్యాణంలో పాల్గొనాలని ధర్మఅప్పారాయ నిలయంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం వెంకటేశ్వరరావు బయటకు వెళ్లే క్రమంలో, సత్రం ముఖ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ మెట్లపై ఉన్న పాము ఆయన కాలి బొటన వేలుపై కరిచింది. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు (బాలలు) జాతీయ సమన్వయకర్తగా తాడేపల్లిగూడెంకు చెందిన కొల్లి రమావతి నియమితులయ్యారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌లు అందించారు. రమావతి ప్రస్తుతం విశ్వ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement