కలెక్టరేట్‌లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణకు ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామ సచివాలయ ఉద్యోగులకు 10 నుంచి 12 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లింపు సమస్య, గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెడికల్ డిపార్టుమెంట్‌కు సంబంధం లేని విధులు కేటాయించవద్దని కోరారు. డిజిటల్ అసిస్టెంట్లకు ఎన్నికల బీఎల్‌ఒ డ్యూటీ వేయవద్దని కోరారు.
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ను మంగళవారం కలెక్టర్ నాగరాణి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని మరింత ఉత్సాహంతో నూతన సంవత్సరంలో విధులు నిర్వహించాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, జిల్లా కార్యదర్శి జి.జకరయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ అలీషా, ట్రెజరర్ పి.నాగభూషణం, ఉపాధ్యక్షుడు కె.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): సామాజిక డిసెంబర్ 31న ఉదయం నుంచి అందజేయనున్నారు. జిల్లాలో 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్ల పింఛన్లను సచివాలయం సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని, ఎవరైనా మిగిలిపోతే జనవరి 2న అందజేస్తారని తెలిపారు. పంపిణీలో లబ్ధిదారులకు ఏమైనా సమస్య ఉంటే ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఏలూరు (టూటౌన్): బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులు ఎత్తివేయాలని, దౌర్జన్యంగా దున్నేసిన గిరిజనుల పంటకు నష్ట పరిహారం చెల్లించాలని, రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గిరిజనులపై పోలీసు నిర్బంధం ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ తదితరులు మాట్లాడారు. జీవో 1049 ప్రకారం ఏజెన్సీ భూ సమస్యలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు గిరిజనేతర భూస్వాముల కొమ్ము కాస్తూ గిరిజనులు, గిరిజనుల నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమని విమర్శించారు.
ఏలూరు (టూటౌన్): 2026 సీజన్‌కు సంబంధించి కొబ్బరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో కొబ్బరి మద్దతు ధరపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సరాసరి ధర కొద్దిగా పెరిగినా రైతులకు పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వ విదేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు రూ.4కు పైగా ఖర్చు అవుతున్నదని వివరించారు.


