ఆయన ఏ పార్టీ?
● మావుళ్లమ్మ ట్రస్ట్‌బోర్డు సభ్యుడిగా నాగభూషణం
● టీడీపీ, జనసేన పార్టీల్లో నాగభూషణంకు సభ్యత్వం
సాక్షి, భీమవరం: ఇంతకీ ఆయన ఏ పార్టీ?.. టీడీపీనా? జనసేనా? భీమవరం కూటమి వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఏడాదికాలంగా నలుగుతున్న భీమవరం మావూళ్లమ్మ వారి దేవస్థానం ట్రస్టు బోర్డు ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన అమ్మవారి ఆలయ చైర్మన్ పదవిని టీడీపీ, జనసేన నుంచి ఎంతోమంది ఆశించారు. టీడీపీకి చెందిన వారికే ఇస్తారని.. లేదు జనసేన పార్టీకి వస్తుందని టాక్ నడిచింది. అమ్మ దయ మాత్రం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితునిగా పేరొందిన బొండాడ నాగభూషణంకు ఇచ్చారు. పట్టణానికి చెందిన నాగభూషణంతో పాటు 13 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని నియమిస్తూ మంగళవారం దేవాదాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాదాయశాఖ సభ్యులతో ప్యానెల్‌ను విడుదల చేస్తే, ప్రమాణ స్వీకార సమయంలో వారిలోంచి ఒకరిని చైర్మన్‌గా మిగిలిన వారు ఎన్నుకుంటారు. చాలావరకు చైర్మన్‌గా ఎంపికయ్యే వారి పేరే ప్యానెల్‌లో మొదటి సభ్యుడిగా పేర్కొంటుంటారు. పాలక మండలి సభ్యుల్లో నాగభూషణం పేరే మొదటిగా ఉండటంతో ఆయనే ఆలయ చైర్మన్‌గా ప్రచారం జరుగుతోంది. నాగభూషణంకు టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోను సభ్యుత్వాలు ఉన్నట్టు గుర్తింపు కార్డులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఏ నామినేటెడ్ పదవికి ఎవరికి కేటాయిస్తారో తెలీని పరిస్థితులు ఉండటంతో ఎందుకై నా మంచిదని రెండు పార్టీల్లోను సభ్యత్వాలు తీసుకుని ఉంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
జనసేన, టీడీపీలో నాగభూషణం సభ్యత్వ కార్డులు
ఆయన ఏ పార్టీ?


