విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
నరసాపురం రూరల్: క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని సీతారామపురంసౌత్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సీతారామపురం వెంకట్రావుతోటలో శుక్రవారం రాత్రి జరుగనున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించి విద్యుత్ దీపాలను అలంకరించే పనులు చేస్తుండగా శీలం అభిరామ్ (19) అనే యువకుడికి 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కిందపడ్డాడు. వెంటనే బాధితుడిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొల్లు మండలంలోని దిగమర్రు గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొంతకాలంగా మొగల్తూరు మండలంలోని జెట్టిపాలెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇరువురూ ఉపాది నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. తల్లి నెల రోజులక్రితమే విదేశాలకు వెళ్లింది. మృతుని సోదరుడు సాయి శరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని మొగల్తూరు ఎస్సై వై నాగలక్ష్మి తెలిపారు.
పాలకొల్లు సెంట్రల్: స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో నాలుగు రోజులుక్రితం జరిగిన మోటర్ సైకిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం ఈ నెల 21న రాత్రి బ్రాడీపేట బైపాస్ రోడ్డు పరిధిలోని ఉల్లంపర్రు గ్రామం ప్రార్వతినగర్‌లో ఇంటి వద్ద బయట పార్క్ చేసిన మోటర్ సైకిల్‌ను చోరీ చేశారు. ఈ ఘటనపై వాహన యజమాని కర్నేని నాగ అవినాష్ ఫిర్యాదు చేయగా రూరల్ ఎస్సై సురేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పార్వతి నగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడంతో చోరీ విషయం తెలిపారు. దీంతో మార్టేరుకు చెందిన పి.రెడ్డి, తూర్పుపాలేనికి మైనర్ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన పలువురు దాతలు ఐదు టన్నుల కూరగాయలను శుక్రవారం విరాళంగా అందజేశారు. అవ్వారు వెంకటలక్ష్మి, అరవపల్లి సుబ్రహ్మణ్యం, బాలాజీ ఎలక్ట్రానిక్స్ అన్నపరెడ్డి లింగారెడ్డి, సాడి శ్రీనివాసరెడ్డి, స్వాతిలు ఈ కూరగాయలను అన్నదాన ట్రస్ట్ సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్‌కు అందజేశారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీవారిని దర్శించే భక్తులకు అందించే అన్నప్రసాదంలో వీటిని వినియోగించాలని దాతలు కోరారు.


