అన్నదాతపై ‘ఎరువు’ దరువు
పెరిగిన ఎరువుల ధరలు ఇలా..
రైతులకు వెన్నుపోటు కూటమి నైజం
రాష్ట్ర ప్రభుత్వం భరించాలి
నిడమర్రు: సార్వాలో అధిక వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయి రైతన్నలు కుదులేయ్యారు. ప్రస్తుతం రబీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచడం వలన రైతు నెత్తిన అదనంగా పెట్టుబడి భారం పడుతోంది. ఎరువుల నుంచి డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రబీ సీజన్‌లో ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 48,883 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరో రూ.30 వేల ఎకరాల్లో పాయాయిల్, మామిడి, కూరగాయలు వంటి ఇతర పంటలు సాగవుతున్నాయి. వరి సాగులో రైతులు ఎకరాకు 6 నుంచి 7 బస్తాల వరకూ ఎరువులు ఉపయోగిస్తారు. ఇందులో మూడు బస్తాల కాంప్లెక్స్ ఎరువు ఉంటుంది. దీంతో నియోజకవర్గంలో అధికారుల గణాంకాల ప్రకారం 26 వేల బస్తాల వరకూ కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రైతులు ఎక్కువగా 28–28–0, 10–26–26, వంటి కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తారు.
బ్లాక్ మార్కెట్‌లోనే యూరియా
అధికారులు రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన యూరియా అందిస్తున్నట్లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితిలేదని రైతులు చెబుతున్నారు. సొసైటీల ద్వారా ఇచ్చే యూరియాను మొదటి కోటా అంటూ ఎకరాకు 1 బస్తా చొప్పునే ఇస్తున్నారు. దీంతో మిగిలిన బస్తాలను ప్రైవేట్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. యూరియా బస్తా ఎంఆర్పీ రూ.266 ఉంటే హోల్ సెల్ మార్కెట్‌లో రూ.290తో పాటు రవాణా కిరాయి రూ.41 కలుపుకుంటున్నారు. దీంతో రూ.266కు బదులు అదనంగా రూ.350 వరకూ పెట్టి రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో యూరియాపై బస్తాకు రూ.90 అదనపు భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. మరి కొందరు డీలర్లు మిశ్రమ ఎరువులతోపాటు జింక్, దుబ్బుగుళికలు తప్పనిసరిగా తీసుకోవాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు వాపోతున్నారు. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందంటూ స్థానిక రైతులు విమర్శిస్తున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఊరట
2019 నుంచి 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన ధాఖలాలు లేవు. ఎరువుల ధరలు నిలకడగా ఉంటంతో రైతులకు ఊరట లభించింది. కానీ ప్రస్తుతం ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం సాగుతోంది.
ఎరువు పాత రబీలో
ధర రూ. ధర రూ.
14–35–14 1,800 1,900
20–20–0–13 1,350 1,450
28–28––0 1,750 1950
10–26–26 1,700 1,800
16–16–16 1450 1,600
16–20–0–13 1,150 1,250
పొటాష్ 1,700 1,800
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడూ బీజేపీ సర్కారు ఎరువుల ధరలు పెంచినా వ్యతిరేకించలేదు. నేడు ఎరువుల ధరలు పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో మాత్రం రైతు పక్షపాతిని అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలో 3 సార్లు ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డివిరచడం దారుణం.
– అలుమోలు గంగారాం, రైతు, బువ్వనపల్లి
సార్వాలో వరుస తుపాన్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడి గణనీయం పడిపోయింది. దీంతో కౌలు రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు అమాంతం ఎరువుల ధరలు పెంచడం వలన రబీలో పెట్టుబడి మరింత పెరుగుతోంది. పెరిగిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
– మచ్చకర్ల సాయిబాబా, కౌలు రైతు, బువ్వనపల్లి
అడ్డగోలుగా ధరలు పెంచిన ఎరువుల కంపెనీలు
బస్తాపై రూ.100 నుంచి రూ.200 వరకు పెంపు
యూరియా బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న రైతులు
అన్నదాతపై ‘ఎరువు’ దరువు
అన్నదాతపై ‘ఎరువు’ దరువు
అన్నదాతపై ‘ఎరువు’ దరువు


