శోభనాచలుని సొమ్ము అప్పగించాల్సిందే
ఆగిరిపల్లి : శోభనాచలుని సొమ్ము వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే మాఘమాస రథసప్తమి ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులు, కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి మాఘ మాస రథసప్తమి ఉత్సవాలపై గురువారం ఆలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి మాట్లాడుతూ ఉత్సవాలు జనవరి 19 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి స్వామివారి అన్నదానానికి భక్తుల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయల చందాలు వివరాలు, నగదును అప్పచెబుతామని చెప్పి ఏడాది అవుతున్నా, అన్నదాన కమిటీ సభ్యులు ఇప్పటివరకు వివరాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అన్నదాన చందాలకు వసూలు చేసిన డబ్బులతో కొందరు వ్యక్తులు వడ్డీ వ్యాపారం చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చొరవ తీసుకొని గ్రామ పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. రెండు సంవత్సరాలకు ఖర్చులు పోను రూ.5.75 లక్షలు మిగలగా వాటిని బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. మరి 20 సంవత్సరాలకి ఎన్ని లక్షలు ఉండాలో చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్వామివారికి అన్నదాన కమిటీ సభ్యులు ఇవ్వాల్సిన లక్షలాది రూపాయలకు వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే మాఘమాస రథసప్తమి ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులు, కుల సంఘాల వారు డిమాండ్ చేశారు.
డిమాండ్ చేసిన గ్రామస్తులు


