డైట్ బిల్లుల కోసం ఎదురుచూపులు
● రెండు నెలలుగా అందని వైనం
● సుమారు రూ.కోటి వరకూ విడుదల కావాల్సిన నిధులు
బుట్టాయగూడెం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇస్తున్న డైట్ బిల్లులు గత రెండు నెలలుగా అందక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఈ బిల్లులు ప్రతి నెలా 4, 5 తేదీల్లోపు సంబంధిత నిర్వాహకులు పంపుతున్నప్పటికీ అవి జమకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తమకు అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి రెండు నెలల బిల్లుల బకాయిలు జమ కావాల్సి ఉందని, డిసెంబర్ మాసం కూడా ముగుస్తున్నందున ఈ నెల బిల్లు కూడా వస్తుందో లేదో అని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలకు సరుకుల సరఫరా ఇలా
బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, టి. నర్సాపురం మండలాల పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 25, కళాశాల వసతిగృహాలు 9 ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో 5,965 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాలేజీ వసతిగృహాల్లో 1,219 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సంబంధించి నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1,400, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,600 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. 2022 సంవత్సరంలో రూపొందించిన ఆహార పట్టిక(మెనూ)ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. దీనిప్రకారం ఆదివారం, మంగళవారాలు చికెన్, ఆరురోజులపాటు గుడ్డు, ప్రతిరోజూ ఉదయం అల్పాహారం విద్యార్థులకు ఇవ్వాలి. దీనికి సంబంధించి నిత్యవసర సరుకులు, బియ్యాన్ని ప్రభుత్వమే జీసీసీ ద్వారా సరఫరా చేస్తుంది. అయితే గ్యాస్‌ను మాత్రం నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి నిర్వాహకులు డైట్ బిల్లులు పెట్టుకున్నప్పటికీ అక్టోబర్, నవంబర్ నెల నుంచి మంజూరు కాలేదు. రెండు నెలలకు సంబంధించి సుమారు రూ.కోటి వరకూ బిల్లులు మంజూరు కావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే డిసెంబర్ నెల కూడా పూర్తి కావొచ్చింది. ఈ నేపద్యంలో 3 నెలల బిల్లు రావాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా రాని బిల్లులు
ప్రస్తుతం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 2022 నాటి మెనూ ప్రకారమే విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ గత రెండేళ్లుగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు, ప్రభుత్వం ఇచ్చే ధరలకు చాలా వ్యత్యాసం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు రూ.ఏడున్నర ఉండగా ప్రభుత్వం రూ.ఐదున్నర మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. అలాగే నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరిగాయని, ప్రభుత్వం మాత్రం కేజీ రూ.30 కు మించి బిల్లులు ఇవ్వడంలేదని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు పెంచి ఇవ్వాలని వారు కోరుతున్నారు.


