ప్రధాన పంట కాలువనూ పట్టించుకోరా?
నరసాపురం: నిడదవోలు–నరసాపురం ప్రధాన పంటకాలువ నరసాపురం ప్రాంతంలో కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలువ పొడవునా గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్లు వ్యవహించడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిఏటా వేసవిలో ఈ కాలువను బాగు చేస్తారు. తూడు, చెత్త తొలగించి పూడికతీత చేస్తారు. కానీ ఈ వేసవిలో కాలువ శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. దీంతో కాలువ పొడవునా చెత్త పేరుకుపోయింది. పూర్తిగా తూడుతో కాలువ నిండిపోయింది.
ప్రధాన కాలువ ఎంతో ప్రాధాన్యం
నరసాపురం నుంచి మొగల్తూరు వరకూ 12 కిలోమీటర్లు మేర కాలువ అధ్వానంగా ఉంది. నరసాపురం మున్సిపాలిటీలోని 31 వార్డులకు, నరసాపురం మండలంలోని 28 పంచాయతీలకు, మొగల్తూరు మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించి మంచినీటి చెరువును ఈ కాలువ నీటిద్వారానే నింపుతారు. సుమారు 6 లక్షల జనాభా తాగునీటికి ఈ కాలువ నీటినే సరఫరా చేస్తున్నారు. కాలువ పూర్తిగా కాలుష్యం భారిన పడటంతో పాటు, అటు మున్సిపాలిటీలోనూ, గ్రామాల్లోని మంచినీటి ప్రాజెక్టుల్లో మంచినీటి శుద్ధిప్రక్రియ సవ్యంగా సాగడంలేదు. దీంతో కాలుష్య నీటితో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు.
చెత్త కూడా కాలువలోనే పోస్తున్నారు
కొన్ని నెలలుగా మున్సిపాలిటీలో డంపింగ్‌యార్డ్ సమస్యతో చెత్తవేసే జాగాలేక ఎక్కడి చెత్తను అక్కడే వదిలేస్తున్నారు. దీంతో కొందరు ఇళ్లలోని చెత్తను రాత్రివేళల్లో కాలువలో పోస్తున్నారు. దీంతో కాలువ మరింత కాలుష్య కారకంగా తయారైంది. ఈ కాలువ ద్వారా 10 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, చెత్త పేరుకుపోవడంతో నీరు పారే అవకాశం లేక సాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
కాలుష్య కోరల్లో నరసాపురం ప్రధాన పంట కాలువ
3 లక్షల మందికి కలుషిత జలమే దిక్కు
సాగునీటి సరఫరాలోనూ తప్పని ఇబ్బందులు
ప్రధాన పంట కాలువనూ పట్టించుకోరా?


