మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపాటు
భీమవరం: మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం భీమవరం కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ 590ని ఉపసంహరించుకోవాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేదలు, బలహీన వర్గాలకు అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వం వైద్యాన్ని అందకుండా చేయడం దారుణమని విమర్శించారు. ప్రైవేటు వైద్య కళాశాలలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నిర్వహిస్తే వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం తన ఆలోచనలను విరమించుకోకపోతే మరిన్ని ఉద్యమాలకు వెనుకాడబోమని భీమారావు హెచ్చరించారు. అనంతరం ఏపీ వైద్య విధాన పరిషత్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణరాజుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, కలిశెట్టి వెంకట్రావు, సనపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


