నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం | - | Sakshi
Sakshi News home page

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం

Sep 1 2025 4:18 AM | Updated on Sep 1 2025 4:18 AM

నిమ్మ

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం

నిమ్మపైనే ఆధారం

నిమ్మ పంటకు నేల అనుకూలం

గ్రామంలోని ప్రతి రైతుకూ నిమ్మతోటలు

కుటుంబసభ్యులే సొంతంగా సేద్యం

సిరులు కురిపిస్తున్న నిమ్మ పంట

జంగారెడ్డిగూడెంః నష్టాల నుంచి బయట పడేందుకు నిమ్మ వైపు మొగ్గారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. దీంతో ఆ గ్రామంలోని రైతులు అటుగా అడుగులు వేశారు. నేడు ప్రతి రైతుకు ఆ పంట సిరులు కురిపిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం నిమ్మ సిరులు కురిపిస్తోంది.

జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంలో ప్రతి రైతు నిమ్మ పంటను పండిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 ఇళ్లు ఉండగా, 150 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 100 మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు ఉన్న భూమిలో కొంత భూమిలో నిమ్మ పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ప్రధానంగా నిమ్మపై ఆధారపడటమే కాక, కుటుంబసభ్యుల అంతా కలిసి వ్యవసాయం చేస్తారు. విద్యార్థులు కూడా ఖాళీ సమయాల్లో నిమ్మ తోటలకు వెళ్లి సొంతంగా కష్టపడుతారు. గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 600 హెక్టార్లు ఉండగా, దీనిలో 300 ఎకరాల్లో రైతులు నిమ్మ పంట వేశారు.

మిరప, పొగాకులో నష్టం రావడంతో..

సుమారు 20 ఏళ్ల క్రితం వరకు గ్రామ రైతులు మిరప, పొగాకు వేసేవారు. ఆ సమయంలో ఈ పంటలకు నష్టాలు రావడంతో ఒకరిద్దరు రైతులు ప్రయోగాత్మకంగా నిమ్మపంట వేశారు. అంతే నిమ్మ సిరులు కురిపించింది. దశలవారీగా రైతులంతా తమ పంట భూమిలో కొంత నిమ్మ పంట వేశారు. మెరక పొలాలు, వరి పొలాల్లో కూడా నిమ్మ పంట వేశారు. ఎకరానికి సుమారు రూ.లక్ష ఆదాయం రైతులకు లభిస్తోంది. దీంతో నిమ్మపంట అమ్మపాలెం గ్రామానికి బంగారం పంటగా మారిపోయింది. ఇప్పుడు ఊరంతా నిమ్మ పంటపైనే ఆధారపడ్డారు. మరొక విశేషం ఏమిటంటే రైతు ఇంటి పెరట్లో ఖాళీ జాగా ఉంటే కచ్చితంగా ఒకటి రెండు నిమ్మ చెట్లు సెంటిమెంట్‌గా పెంచుతున్నారు. ఊరంతా రైతు కుటుంబాలే. వీరంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటారు. అందరూ ఒకే కట్టుబాటును పాటిస్తూ ఏకతాటిపై ఉంటారు.

కుటుంబ సభ్యులంతా తోటల్లోకి వెళ్లి నిమ్మకాయలు కోసి సంచుల్లో నింపి ఊర్లో రోడ్డుపక్కన ఉంచుతారు. నిమ్మకాయల వ్యాపారులు మోటార్‌సైకిళ్లపై వచ్చి ఒకొక్క రైతు నుంచి వరుసగా కొనుగోలు చేసుకుని ట్రక్కు ఆటోలో ఏలూరు, జంగారెడ్డిగూడెం నిమ్మ మార్కెట్‌కు తరలిస్తారు. అమ్మపాలెంలో పండే నిమ్మ పంట మంచి నాణ్యత కలిగి ఉంటుంది.

అమ్మపాలెం పంచాయతీ రైతులంతా నిమ్మ పంటపై ఆధారపడి ఉన్నాం. ఇది మా పంచాయతీకి బంగారు పంట. కుటుంబ సభ్యులంతా కష్టపడి సేద్యం చేస్తాం. మా పంచాయతీలో ప్రతి రైతుకు నిమ్మ పంట ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ సేద్యం చేసుకుంటాం.

– కనపర్తి వెంకట సత్యనారాయణ, నిమ్మరైతు

మా గ్రామం నిమ్మ పంటకు ప్రసిద్ది. నిమ్మ పంటకు నేల బాగా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి అధికంగా వస్తుంది. పండిన పంటను వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి ఏలూరు, జంగారెడ్డిగూడెం మార్కెట్‌కు తరలిస్తారు. మాకు ఈ పంట సిరులు కురిపిస్తోంది.

– సూరవరపు రాంబాబు, నిమ్మరైతు, సర్పంచ్‌, అమ్మపాలెం

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం1
1/3

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం2
2/3

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం3
3/3

నిమ్మ కేరాఫ్‌ అమ్మపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement