
అధిక యాంటీ బయోటిక్‌తో ముప్పు
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం
కొయ్యలగూడెం: పశువులకు చేసే వైద్యంలో మోతాదుకు మించిన యాంటీ బయోటిక్స్ వాడకం ఎక్కువవుతుందని దీని వల్ల పశువుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు పాల ఉత్పత్తి పడిపోతుందని యర్రంపేట వెటర్నరీ డాక్టర్ పి.అపురూప పేర్కొన్నారు. యాంటీ బయోటిక్స్ వాడకం, అవగాహనపై రైతులకు పలు సూచనలు చేశారు.
యాంటీ బయోటిక్ నిరోధకత తీవ్రమైన ప్రపంచ సంక్షోభం. ఇది మానవ, జంతు ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. పశువుల పెంపకంలో యాంటీ బయోటిక్స్‌ను విరివిగా, తరచూ ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియాను తట్టుకునేలా పశువులలో ఇమ్యూనిటీ బలహీన పడుతుంది. ఫలితంగా సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ పనిచేయదని, ఇది చికిత్సను సంక్లిష్టం చేస్తుందన్నారు. రోజు రోజుకు బాక్టీరియాలో పెరుగుతున్న నిరోధకతను సరైన అవగాహనతో అరికట్టడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. బాక్టీరియాలో నిరోధతకు ప్రధాన కారణాలు యాంటీ బయోటిక్స్ సులభంగా, చౌకగా లభించడంతో వాడకందారులు ఎక్కువగా వాటిని ఉపయోగిస్తున్నారు.
మోతాదు మించి వాడకంతో తగ్గుతున్న రోగ నిరోధకత
యాంటీ బయోటిక్స్ దుర్వినియోగంపై ప్రజల్లో అవగాహనా లేకపోవడం పశువుల పాలిట యమపాశం అవుతుంది. పశువులకు ఇచ్చిన యాంటీబయాటిక్‌ల అవశేషాలు మాంసం, పాలు లేదా ఇతర ఉత్పత్తుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి, వారిలో కూడా యాంటీబయాటిక్ అవశేషాలు వ్యాధి నిరోధకతను తగ్గిస్తాయి. సరైన మోతాదులో యాంటీ బయోటిక్‌లు ఇవ్వకపోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల, బలంగా ఉండే బ్యాక్టీరియా బతికి, నిరోధకతను అభివృద్ధి చేస్తుందిరు. నిరోధకత పెరగడం వల్ల, పశువులలో సాధారణ వ్యాధులను కూడా నయం చేయడం కష్టమవుతుంది. పశువులు అనారోగ్యానికి గురికావడం లేదా మరణించడం వల్ల రైతులకు భారీగా నష్టం కలుగుతుంది.
బ్యాక్టీరియాను చంపడానికి యాంటీ బయోటిక్‌కు ప్రత్యామ్నాయలపై ఇటీవల పరిశోధనలు పెరిగాయి. నానో టెక్నాలజీ, మొక్కల నుంచి లభించు పదార్ధాలతో యాంటీ బయోటిక్ నిరోధకతను ఎదుర్కొనడం, ప్రో బయోటిక్స్ మొదలగు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాంటీ బయోటిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. యాంటీ బయోటిక్స్ పశు వైద్యుడి సలహా మేరకు లేదా పశువైద్యుడి సంరక్షణలో మాత్రమే ఉపయోగించాలి., పశువులు వ్యాధి లక్షణాల నుంచి తేరుకునప్పటికి ముందుగా పశు వైద్యులు సూచించిన యాంటీ బయోటిక్స్ కోర్సు పూర్తిగ వాడాలి. యాంటీ బయోటిక్స్ నియంత్రణకు మార్గదర్శకాలు అవసరమన్నారు. ఇప్పటికే మార్గదర్శరకాలు రూపొందిస్తున్నారని, అది సఫలమైతే రైతులకు వరంగా మారుతుంది.
పశువుల్లో జాగ్రత్తలు
తీసుకోవాలంటున్న పశు వైద్యులు
నవంబర్ నెలలో ప్రపంచ యాంటీబయాటిక్ అవేర్‌నెస్ వీక్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు, రైతులలో అవగాహన పెంచుబోతున్నాం. ఇందుకు మోడల్‌గా కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. దీనిపై రిజల్ట్ అనుకూలంగా వస్తే శివారు గ్రామాలలో కూడా కార్యక్రమాలు విస్తరిస్తాం.
పి.అపురూప, పశువైద్యధికారి, యర్రంపేట పశువైద్యశాల

అధిక యాంటీ బయోటిక్‌తో ముప్పు

అధిక యాంటీ బయోటిక్‌తో ముప్పు