
విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి
జంగారెడ్డిగూడెం: ఈ నెల 29 రాత్రి అదృశ్యమైన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఆచూకీ లభ్యమైంది. విధి నిర్వహణలో భాగంగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎర్రకాలువలో కొట్టుకుపోయి మృతిచెందారు. దీనికి సంబంధించి డీఎస్పీ యు.రవిచంద్ర వివరించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని కామవరపుకోట, టి.నరసాపురం మండలాల్లో బుడుపుల సుబ్బారావు పోలీసు శాఖ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం బుట్టాయగూడెం. ఈ నెల 29 రాత్రి కామవరపుకోట, టి.నరసాపురం మండలాల్లోని వినాయక చవితి మండపాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెం సమీపంలోని ఎర్రకాలువ సప్టా దాటుతుండగా, అకస్మాత్తుగా నీటి ఉధృతితో ఆయన ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయారు. శనివారం ఉదయం వరకూ సుబ్బారావు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం నుంచి సుబ్బారావు ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం ప్రయత్నించింది. రాత్రి వరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. డీఎస్పీలు యు.రవిచంద్ర, ఎం.వెంకటేశ్వరరావు, చింతలపూడి, జీలుగుమిల్లి సీఐలు, ఎస్సైలు అప్పలరాజుగూడెం ఎర్రకాలువలో గాలింపు చర్యలు పర్యవేక్షించారు. మత్స్యకారుల సాయంతో కాలువలో గాలించారు. కాలువలో ఒక చోట సుబ్బారావు బైక్ లభించగా, జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం పంచాయతీ చిన్నవారిగూడెం సమీపంలో ఎర్రకాలువలో బుడుపుల సుబ్బారావు (48) మృతదేహం లభించింది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బారావు స్వగ్రామం బుట్టాయగూడెం తరలించారు.
బుట్టాయగూడెంలో విషాద ఛాయలు
బుట్టాయగూడెం: హెడ్ కానిస్టేబుల్ బుడుపుల సుబ్బారావు భౌతికకాయానికి బుట్టాయగూడెంలో ఆదివారం రాత్రి ఎస్పీ కె.ప్రతాప్ కిశోర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుబ్బారావు భార్య మాలినిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మృధుస్వభావి, విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందిన సుబ్బారావు అకాల మృతితో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న డీఎస్పీలు యు.రవిచంద్ర, ఎం.వెంకటేశ్వరరావు
చిన్నవారిగూడెం సమీపంలో ఎర్రకాలువలో లభించిన బుడుపుల సుబ్బారావు మృతదేహం
ఎర్రకాలువ దాటుతుండగా గల్లంతు

విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి

విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి