
సంప్రదాయ డ్రెస్ కోడ్ అమలు ఎప్పుడు?
● పలు ప్రముఖ ఆలయాల్లో అమలవుతున్న డ్రెస్ కోడ్
● ద్వారకాతిరుమలలో నేటికీ అమలు కాని విధానం
ద్వారకాతిరుమల: సంస్కృతి, సంప్రదాయాలకు హిందూ ఆలయాలు పెట్టింది పేరు. భక్తులు ఒకప్పుడు ఆలయాలకు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లేవారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో రకరకాల మోడల్ దుస్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. దాంతో కొందరు యువతి, యువకులు, మహిళలు, పురుషులు సంప్రదాయాలకు విరుద్ధమైన దుస్తుల్లో ఆలయాలకు వెళుతున్నారు. దీని కారణంగా దేవాలయాల పవిత్రతకు భంగం కలుగుతోంది. దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు ఇటీవల విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టారు. పంచె, కండువా ధరించిన పురుషులను, చీరలు, లంగా ఓణి, చుడీదార్ వంటి సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను, యువతులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఎన్నో ఆలయాల్లో ఈ డ్రెస్‌కోడ్ ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయితే చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మాత్రం నిత్యార్జిత కల్యాణంలో పాల్గొనే భక్తులకు మాత్రమే డ్రెస్ కోడ్ అమలులో ఉంది. స్వామివారి దర్శనార్ధం ఆలయంలోకి వెళ్లే భక్తులకు ఎటువంటి డ్రెస్ కోడ్ లేదు. దాంతో కొందరి భక్తుల వస్త్రధారణ ఆలయ పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నాయి. కొందరు యువతులు, మహిళలు జీన్స్ ప్యాంట్లు, గౌన్లు, స్లీవ్ లెస్ డ్రస్‌లు వేసుకొస్తున్నారు. కొందరు యువకులు చిరిగిన జీన్స్ ఫ్యాంట్లు, టీషర్ట్‌లు, ఇలా రకరకాల మోడల్స్ దుస్తుల్లో ఆలయానికి వస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు శ్రీవారి ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు చేసి, ఆలయ పవిత్రతను కాపాడి, భక్తుల్లో ఆధ్యాత్మిక భావాలను మరింతగా పెంపొందించాలని పలువురు కోరుతున్నారు.

సంప్రదాయ డ్రెస్ కోడ్ అమలు ఎప్పుడు?