
ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేయాలి
భీమవరం అర్బన్: డీఎస్సీ ఉద్యోగాల్లో మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరి ద్వారానే నియమించాలని దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ డిమాండ్ చేశారు. భీమవరం మండలంలోని తాడేరులో దళిత ఐక్య వేదిక భీమవరం మండల శాఖ ముఖ్య నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ జీవో నెం. 77 ప్రకారం డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించిన విధంగా పోస్టులు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిలో రిజరేషన్ల ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు అభర్థులకు రాకుండా తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పారదర్శకంగా నిర్వహించవలసిన ఉద్యోగాల భర్తీని సీక్రెట్‌గా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గొల్లా రాజ్‌కుమార్, జె. విజయకుమార్, కె. కళ్యాణ్, ఎ ఆనంద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.