రాష్ట్రంలో మద్యం, గంజాయి పాలన
ఆకివీడు: రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులైపారడంతో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానికంగా చిన్నారిపై అఘాయిత్యాన్ని ఖండిస్తూ మంగళవారం నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, మెప్మా మాజీ అధ్యక్షురాలు మోరా జ్యోతిరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండుగొలను సావిత్రి, ధనరాజు మాట్లాడుతూ ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార సంఘటన అమానవీయమన్నారు. టీడీపీకి చెందిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణ, గ్రామాలకు దూరంగా మద్యం షాపులు ఉండాలన్నారు. బెల్టు షాపుల బెల్టు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం తీవ్ర నిర్లిప్తతతో ఉందన్నారు. పట్టణంలోని విచ్చలవిడిగా గంజాయి, మద్యం దొరుకుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, దొడ్డి జగదీష్, తిరుమానేని జగన్, కిషోర్‌రెడ్డి, మోరా శ్రీనివాసరెడ్డి, కుంకట్ల దానయ్య పాల్గొన్నారు.
ఆకివీడులో చిన్నారిపై అఘాయిత్యం దారుణం
వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన


