నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలి
ఉండి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వినయలక్ష్మి
భీమవరం అర్బన్: వ్యవసాయంలో సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలని ఉండి, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి. వినయలక్ష్మి అన్నారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, వాటి దిగుబడులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినయలక్ష్మి మాట్లాడుతూ 2048 వికసిత భారత్‌లో వివిధ రంగాల రైతులందరూ భాగస్వాములు కావాలన్నారు. వ్యవసాయంలో నూతన వంగడమైన ఎమ్‌టీయూ 1224 వంగడం గురించి వివరించి దాని బీజం, దిగుబడి గురించి చెప్పారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు సమీపిస్తుందని రైతులు భూసారం పెంచుకునేందుకు పచ్చిరొట్ట, పశువులు, కోళ్ల ఎరువులు చేలల్లో వేసి దున్నాలన్నారు. అంతేకాకండా సాగులో విచక్షణా రహితంగా రసాయన మందులు, ఎరువులు వాడి భూసారాన్ని పాడుచేయవద్దన్నారు. భావి తరాల జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు అందించాలంటే రైతులు నూతన వంగడాలవైపు మొగ్గు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి సీటీఆర్‌ఐ టుబాకో, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డాక్టర్ వై. సుబ్బయ్య, శాస్త్రవేత్త పి. సహదేవరెడ్డి , ఏఈఓ దేవి స్వరూప, రైతు కోళ్ల సీతారామ్, రైతులు పాల్గొన్నారు.


