మూటలు మోయడం మళ్లీ మొదలు
దుకాణాల వద్ద పడిగాపులు
పనిచేయని ఈ–పోస్ యంత్రాలు
ఇంటి వద్దకే రేషన్‌కు కూటమి మంగళం
ఏలూరు (టూటౌన్)/భీమవరం : ఇంటింటికీ రేషన్ సరుకులు పోయి రేషన్ దుకాణాల ద్వారా అందించే వ్యవస్థ రావడంతో ప్రజలకు తిరిగి కష్టాలు ప్రారంభమయ్యా యి. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం తొలిరోజు చాలా చోట్ల ఈ–పోస్ మెషీన్లు పనిచేయకపోవడంతో కార్డుదారులు పడిగాపులు కాశారు. కొందరు తాము ఏ షాపులో రేషన్ తీసుకోవాలో తెలియక గందరగోళం నెలకొంది. పలుచోట్ల షాపుల వద్ద క్యూలైన్లు కనిపించాయి.
భీమవరం మండలం దెయ్యాలతిప్పలో ఒకరిద్దరికి సరుకులు ఇచ్చి రేషన్ షాపును మూసేశారు. యలమంచిలి మండలం మేడపాడు, నరసాపురం మండలం కొప్పర్రులో ఈ–పోస్ యంత్రాలు పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిగూడెం రూరల్, ఆకివీడు తదితర ప్రాంతాల్లో రేషన్ సరుకులను దూర ప్రాంతాల నుంచి వచ్చి వాహనాలపై తీసుకువెళ్లడం కనిపించింది. జిల్లాలో 1,060 రేషన్ షాపుల ద్వారా 5.67 లక్షల కార్డుదారులకు నిత్యావసరాలు అందించాల్సి ఉండగా తొలిరోజు పంపిణీ కార్యక్రమం అభాసుపాలయ్యింది.


