ప్రమాదంలో ప్రజారోగ్యం
సుస్తీ చేసి ప్రభుత్వాస్పత్రికి వెళ్తే మందుల కొరత.. వైద్యుల కొరత.. సౌకర్యాల లేమి.. ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు.. పీహెచ్‌సీ వైద్యులు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్ల ధర్నాలు.. మంజూరు కాని 108, 104 వాహనాలు.. పింఛన్ల తొలగింపుతో దివ్యాంగుల ఆందోళనలు.. ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు.. మొత్తంగా జిల్లాలో 2025లో ప్రభుత్వ వైద్యం దినదిన గండంగా సాగింది.. పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారింది. చంద్రబాబు ఏలుబడిలో ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
భీమవరం(ప్రకాశం చౌక్): చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వైద్యరంగంపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా 2025లో జిల్లాలో జరిగిన సంఘటనలు ఇందుకు సాక్ష్యంలా నిలుస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో కూటమి సర్కారు చెలగాటమాడిందనే విమ ర్శలు వెల్లువెత్తాయి. చిన్నపాటి వైద్యానికి పేదలు వేలల్లో ఖర్చు చేయాల్సి పరిస్థితి వచ్చింది.
పేదలపాలిట సంజీవనిలా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలకు మే, అక్టోబర్‌లో అవాంతరాలు ఏర్ప డ్డాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 30 వరకు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచి రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర సేవలు అందక , అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో తల్లడిల్లిపోయారు.
గ్రామాల్లో స్థానికంగానే వైద్య సేవలు అందాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి వాటిలో సీహెచ్‌ఓలను నియమించారు. అయితే చంద్రబాబు ప్రభు త్వం విలేజ్ క్లినిక్‌లపై తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో సీహెచ్‌ఓలు నిరసన బాట పట్టారు. మే నెలలో దాదాపు నెల రోజులపాటు వేతనాలు, సౌకర్యాల కోసం కలెక్టరేట్ వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామాల్లో వైద్య సేవలు అందక ప్రజలు అవస్థలు పడ్డారు.
వైద్యారోగ్య శాఖలో పనిచేసే ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్యమిత్రలు, 104 ఉద్యోగులు, పీహెచ్‌సీ వైద్యులు ధర్నాలకు దిగారు. భీమవరం కలెక్టరేట్ వద్ద మే నెల నుంచి అక్టోబర్ వరకు పలు రూపాల్లో నిరసనలు తెలిపారు. ఆశావర్కర్లు, ఆరోగ్య మిత్రలు, 104 ఉద్యోగులు పనికి తగిన వేతనం చెల్లించాలని, పీహెచ్‌సీ వైద్యులు పదోన్నతుల కోసం నినదించారు. అయినా వారి డిమాండ్లను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరానికి 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేయగా తొలుత రూ.10 కోట్లు, తర్వాత రూ. 28 కోట్ల నిధుల విడుదల చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. దీంతో భవన నిర్మాణ పనులు మందగించాయి.
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యు లు, సౌకర్యాల కొరత వేధిస్తోంది. వైద్యుల నియామకం, సౌకర్యాల కల్పనపై ప్రభు త్వం దృష్టి సారించలేదు. అలాగే మందులలేమితో రోగుల ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వంలో జిల్లాకు కేటాయించిన 108,104 వాహనాలు తప్ప 2025లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి వాహనాలు కేటా యించలేదు. దీంతో పాత వాహనాలతోనే సేవలు అందిస్తున్నారు.
2025లో పెన్షన్ల పరిశీలన పేరిట దివ్యాంగులను దూరప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వాస్పత్రులకు రప్పించడంతో వీరంతా చాలా ఇబ్బంది పడ్డారు. పెన్షన్ తీసివేస్తారని మానసికంగా తీవ్ర ఆందోళన పడేలా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశీలన పేరుతో పలువురి పింఛన్లు తొలగించింది.
జిల్లాలోని ఏరియా, జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 200 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ఏడాదంతా సజావుగా జీతాలు అందలేదు. మూడు, నాలుగు నెలలకోసారి కాంట్రాక్టర్ ద్వారా జీతాలు అందించడంతో వీరంతా నిరసనలు తెలిపారు. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారంటూ వినతిపత్రాలూ అందించారు.
వైద్యం.. పూజ్యం
ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
రెండుసార్లు ఆరోగ్యశ్రీ సేవలు బంద్
పీహెచ్‌సీ వైద్యులు, సీహెచ్‌ఓల ధర్నాలు
గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందని సేవలు
ఎక్కడికక్కడే నిలిచిన ఆస్పత్రి నిర్మాణాలు
దవాఖానాల్లో వైద్యులు, సౌకర్యాలు, మందుల కొరత
ఏడాదంతా దినదిన గండంలా సర్కారీ వైద్యం
ప్రమాదంలో ప్రజారోగ్యం
ప్రమాదంలో ప్రజారోగ్యం
ప్రమాదంలో ప్రజారోగ్యం
ప్రమాదంలో ప్రజారోగ్యం


