గడపను వీడిన సేవలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన పేదింటి తలుపు తట్టింది.. ఇంటికే పింఛన్, జగనన్న ఆరోగ్య సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, ఫ్యామిలీ డాక్టర్.. ఇలా కార్యక్రమం ఏదైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ప్రజల చెంతకు చేర్చింది. గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని పనులను ప్రజలు గడప దాటకుండానే చేసి చూపించింది. ఇదంతా గతం.. ప్రభుత్వం మారింది.. పాలన మారింది.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదిలోనే గడప చెంతకొచ్చే ఎన్నో సేవలకు మంగళం పాడింది.
సాక్షి, భీమవరం: ఆరేళ్లకు పూర్వం ఏ పథకం అందాలన్న జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ప్రభుత్వ పథకం పొందాలన్నా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఎమ్మెల్యేలు, మంత్రులను కలవడమంటే సామాన్యులకు గగనమయ్యేది. పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను కొత్త పుంతలు తొక్కించారు. జిల్లాలో 535 సచివాలయాలు, 8,616 మంది వలంటీర్లతో పాలనను ప్రజలకు చేరువ చేశారు. కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, అవినీతి అక్రమాలకు తావులేకుండా పథకాల అమలులో ఈ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేశాయి. ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందించడంతో పాటు అనారోగ్యంతో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారుల చెంతకు సైతం వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేసేవారు. రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన పనిలేకుండా మొబైల్ (ఎండీయూ) వాహనాలను తెచ్చారు. జిల్లాలోని 356 రేషన్ వాహనాల ద్వారా 5,67,671 మంది కార్డుదారులకు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించేవారు.
ఫ్యామిలీ డాక్టర్‌తో చేరువ
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారు. జిల్లాలోని 20 మండలాల్లోని 41 పీహెచ్‌సీల పరిధిలోని 366 విలేజ్ హెల్త్ క్లినిక్ (వీహెచ్‌సీ)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలు అందించారు. వైద్యులు ఇళ్ల వద్ద మంచానికే పరిమితమైన రోగుల చెంతకు సైతం వెళ్లి వైద్యసేవలు అందించేవారు.
‘గడపగడపకూ’తో సత్వర పరిష్కారం
గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేలా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలుచేశారు. సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి రూ.20 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ తదితర రూ.83 కోట్ల విలువైన 1,836 పనులు గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం కృషి చేసింది.
కూటమి పాలనలో ఇంటింటికీ సేవలకు మంగళం
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసిన వలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం ద్వారా గడప చెంతకే సేవలకు మంగళం పాడింది. పింఛన్ల కోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలో వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. పేదలకు వైద్య భరోసా కల్పించిన ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణను పక్కన పెట్టేసింది. మొన్నటివరకు తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం వ్యయప్రయాసల కోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ పత్తాలేకుండా పోయారు. పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లజోళ్లను అందజేసే ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు సైతం మూతపడ్డాయి. ఏడాది పాలనలోనే ప్రభుత్వ సేవలు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
నాడు సంక్షేమం.. నేడు సంక్షామం
పేదింటి తలుపు తట్టిన జగన్ ప్రభుత్వం
ఇంటి వద్దకే పథకాలు, వైద్య సేవలురేషన్ సరుకులు, సర్టిఫికెట్లు
‘గడపగడపకు మన ప్రభుత్వం’తో సమస్యల పరిష్కారం
ప్రజలకు ఈ సేవలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
వలంటీర్ వ్యవస్థ తొలగింపు
పత్తాలేని ‘ఫ్యామిలీ డాక్టర్’
రేషన్ సరుకుల డోర్ డెలివరీ వ్యవస్థ రద్దు
గతంలో సర్టిఫికెట్ల జారీ సులభతరం
ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలుచేశారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు జిల్లాలోని 6.45 లక్షల కుటుంబాలను సర్వే చేసి వారి అవసరాలను గుర్తించారు. 6,05,780 మంది లబ్ధిదారులకు ఎలాంటి సర్వీస్ చార్జ్ లేకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో జనన, మరణ, ఆదాయ, కుల తదితర 6,48,807 సర్టిఫికెట్లు జారీ చేశారు.
ప్రజారోగ్యమే పరమావధిగా..
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించారు. 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 182 మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బందితో జిల్లావ్యాప్తంగా 447 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 3.54 లక్షల మంది పేదలకు అవసరమైన వైద్య సాయం అందించారు.


