
సర్పంచ్‌లపై ‘రెడ్‌బుక్’ వేధింపులు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి నేతల రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన సర్పంచ్‌లపై వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెక్‌పవర్ రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారని, దీనిపై వారం రోజుల్లో కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవాలని పంచాయతీ అధికారి చెప్పడం కూటమి నాయకులు రాజకీయ కుట్రలో భాగం అన్నారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తప్పుడు ఫిర్యాదులు చేయించి..
సమావేశంలో శ్రీరామవరం కామిరెడ్డి నాని మాట్లాడుతూ... పంచాయతీలో టీడీపీ మెంబర్లు వీఎన్‌వీ త్రినాథ్, ఆళ్ళ విజయలక్ష్మితో పాటు కొందరితో తప్పుడు ఫిర్యాదు చేయించారని, వాటిపై డీపీవో ఆధ్వర్యంలో 8 నెలల పాటు విచారణ చేయించారని తెలిపారు. విచారణలో ఒక్కరూపాయి దుర్వినియోగం కాలేదని, బిల్లులు ఉన్నాయని చెబుతూనే.. మరోవైపు వేధింపులకు పాల్పడడం దారుణం అన్నారు. 2021 డిసెంబర్‌లో రూ.20,875 నిధులు దుర్వినియోగం అయ్యాయని చూపిస్తున్నారని, కానీ ఈ నిధులకు సంబంధించి అధికారుల విచారణలో ఓచర్లు, ఎన్‌ఎంఆర్ ఉన్నాయని తెలిసినా.. రూ.17 వేలకు తీర్మానం లేదని, బిల్లులను ఏఈ సర్టిఫై చేయలేదని, మిగిలిన రూ.4875కు బిల్లులు ఉన్పప్పటికీ స్టాక్ రిజిస్టర్‌లో నమోదు కాలేదని చెబుతున్నారని తెలిపారు. ఎల్‌ఈడీ లైట్ల కొనుగోలుకు రూ.1.31 లక్షల నిధులకు సైతం బిల్లులు, తీర్మానం ఉండగా స్టాక్ రిజిస్టర్‌లో లేవంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కామిరెడ్డి నాని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం
సర్పంచ్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోకుండా, సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేయటం దారుణమని ఎస్సీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెండెం సంతోష్‌కుమార్ అన్నారు. కామిరెడ్డి నానిపై వేధింపులు ఆపకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ మాట్లాడుతూ.. దెందులూరు నియోజకవర్గంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చట్టపరంగా పోరాటం చేస్తామని తెలిపారు.
బిల్లులున్నా.. నిధుల దుర్వినియోగమంటూ చెక్ పవర్ రద్దు
న్యాయపోరాటం చేస్తానంటున్న కామిరెడ్డి నాని
ఇవి రాజకీయ వేధింపులు కావా? : నాని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలో సాధారణ సమావేశం నిర్వహించలేదని, దీని ఆధారంగా ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదంటూ డీపీవో నోటీస్ జారీ చేయటం రాజకీయ వేధింపులు కాదా? అని నిలదీశారు. సమావేశం పెడితే అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీలు, అసాంఘిక శక్తులను సమావేశాలకు తీసుకువచ్చి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించటం నిజం కాదా అన్నారు. పోలీస్ రక్షణ కావాలని అడిగితే మీ భద్రత బాధ్యత నాది కాదని డీపీవో చెప్పడం నిజం కాదా అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన 7 మందికి పైగా సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.