
అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపాలి
భీమవరం (ప్రకాశంచౌక్): అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేటు పీజీఆర్‌ఎస్ సమావేశం మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీలను జేసీ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్ళి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపిస్తే ప్రజలకు నమ్మకం, అధికారులపై గౌరవం కలుగుతుందని అన్నారు. సోమవారం 192 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కెసీహెచ్ అప్పారావు, వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.