దర్జాగా విద్యా వ్యాపారం
భీమవరం: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే నాథుడు లేదు. అధికారుల అండదండలతో వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సుమారు 495 ప్రైవేటు విద్యాసంస్థలుండగా వాటిలో 96 ప్రైమరీ, 190 అప్పర్ ప్రైమరీ, 209 హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్ధల్లో ఇంటర్, డిగ్రీ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం గాకుండా స్కూళ్లలో జాయిన్ చేసుకోకూడదనే నిబంధనలున్నా వాటిని పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఒక్కో స్కూల్ వద్ద రెండు, మూడు కౌంటర్లు పెట్టి ప్రవేశ పరీక్షలు నిర్వహించి ముందుగానే ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం వంటివి నిషేధమైనా స్కూళ్లు, కళాశాలల్లో ప్రవేశ ఫీజుతోపాటు, డిపాజిట్, ట్రావెలింగ్, స్కూల్, కళాశాల ఫీజు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. యూనిఫాం, పుస్తకాలు, స్టేషనరీకి అదనం.. హాస్టల్ వసతి అవరమైతే మరింత ఫీజులు చెల్లించాలి. జూనియర్ ఇంటర్ విద్యార్థుల నుంచి ఏడాదికి ఫీజు, ట్రావెలింగ్ రూపంలో దాదాపు రూ.1.40 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాసంస్థల్లో కనీసం ఆట స్థలాలు లేకపోగా మరికొన్ని స్కూళ్లు, కళాశాలలు ప్రధాన రహదారి పక్కనే నిర్వహిస్తున్నారు. రహదారిపై వెళ్లే ఇతర వాహనాల రణగణ ధ్వనులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలను అతిక్రమించి పుస్తకాలు అమ్మడం, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం వంటి ఘటనలపై విద్యార్థి సంఘాల నాయకులు పోరాటాలు చేసినా అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుక్స్, స్టేషనరీ నిల్వ ఉంచిన రూంలను తాత్కాలికంగా సీజ్ చేయడం మినహా ఆయా విద్యాసంస్ధలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు కన్పించడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయా? అనేది ప్రశ్నార్థకమే.. విద్యార్థులతో బట్టీపట్టించడమే గాక సెక్షన్ల వారీగా విభజించి తీవ్ర ఒత్తిడితో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. సెలవు రోజులు, పాఠశాలల సమయం ముగిసిన తరువాత కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన, సకాలంలో ఫీజులు చెల్లించని విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టడం, సహచర విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడడం చేస్తున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
ముందుగానే యూనిఫాం, పుస్తకాలకు సొమ్ములు వసూలు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యా సంవత్సరం ప్రారంభంగాకుండా ప్రవేశాలు చేస్తే నోటీసు ఇచ్చేలా మండల విద్యాశాఖాధికారులను ఆదేశిస్తాం. పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తే చర్యలు తప్పవు.
– ఈ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం
దర్జాగా విద్యా వ్యాపారం
దర్జాగా విద్యా వ్యాపారం


