కేసులు పెట్టడానికి పదవి ఇవ్వలేదు
పాలకొల్లు సెంట్రల్: ప్రజలకు సేవ చేయమని పదవి ఇచ్చారని, అంతేగానీ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడానికి పదవి ఇవ్వలేదని మంత్రి నిమ్మల రామానాయుడును నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ గుడాల గోపి హితవు పలికారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత నెలలో యలమంచిలి మండలంలో జరిగిన ఎంపిపి ఎన్నిక విషయంలో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టించి.. తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎంపీటీసీ కంబాల సత్యశ్రీని పోలీసులు తీసుకువెళ్లడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారని.. దాంతో ఎస్సై ఎంపీటీసిని తీసుకువచ్చేస్తామని చెప్పారని.. ఇప్పుడు రెండు రోజుల్లో ఏడుగురిపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే తప్పంటే ఇంక ఈ ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు. కేసులు పెడితే భయపడి మీ పంచన చేరతారని ఊహిస్తున్నారేమోనని.. అలాంటి నీచ రాజకీయాలు చేయవద్దని సూచించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలందరూ జగనన్నపై ప్రేమతో ఉన్నావారేనని.. పదవుల కోసమో, సంపాదన కోసమో ఉన్నవారు కాదని అన్నారు. అలాంటి అభిమానంతో వచ్చిన కేడర్‌ను మీరు ఎప్పటికి కొనలేరని.. బెదిరించి పార్టీలు మార్పించుకోలేరన్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం టిడ్కో గృహాల్లో జరిగిన గొడవపై ఇప్పుడు కేసులు పెట్టించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులను ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం అన్యాయమని అన్నారు. 41 నోటీసులు ఇచ్చిన తరువాత కూడా రోజూ భీమవరం పోలీస్‌స్టేషన్‌కు రమ్మని పిలవడం ఏంటో అర్ధంకావడం లేదన్నారు.
వైఎస్సార్‌సీపీ పాలకొల్లు
నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి


