కంకర మాఫియాకు పోల‘వరం’
ఉంగుటూరు: మండలంలోని కంకర మట్టి మాఫియాకు పోలవరం కుడికాలువ గట్టు వరంలా మారింది. రాత్రి సమయంలో పోలవరం కుడికాలువ గట్టును తవ్వి దర్జాగా మట్టిని తరలించుకుపోతున్నారు. మండలంలోని చేబ్రోలు, నారాయణపురం, కై కరం గ్రామాల్లో ఈ కంకర మాఫియా ముఠాలు తయారయ్యాయి. అలాగే మండల సరిహద్దు ప్రాంతమైన శింగరాజుపాలెం నుంచి ఉంగుటూరు మండలం కంసాలిగుంట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేరకు ఈ కాలువ విస్తరించి ఉంది. ఆ కాలువ వెంబడి గోపాలపురం, గొల్లగూడెం, కంసాలిగుంట, నల్లమాడు, యర్రమిల్లిపాడు గ్రామాల్లో రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై కంకర తరలిపోతోంది. లక్షలాదిరూపాయలు సొమ్ములు ఆర్జిస్తున్నారు. కూటమి ముఖ్య నేతల అండదండలతోనే ఈ కంకర మాఫియా చెలరేగిపోతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ తవ్వకాలు గొల్లగూడెం వీఆర్‌ఓ నాగరాజును ప్రశ్నించగా మా దృష్టికి వచ్చిన వెంటనే వెళ్లి పట్టుకుని కేసులు పెడుతున్నట్లు వివరించారు. అలాగే ఇటీవల కంసాలిగుంట ప్రాంతం నుంచి కంకర తరలిస్తుంటే కేసులు కూడా నమోదు చేశామని వివరించారు.


