
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో సంచలనం రేకెత్తించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గంధం బోసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. బోసుబాబు భార్య శాంతికుమారి తనకు మేనమామ వరుసైన సొంగా గోపాలరావుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్‌కుమార్ సోమవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు.
భర్త పెట్టే బాధలు భరించలేక
గంధం బోసుబాబు భార్య శాంతికుమారి, తన మేనమామ వరుసైన గోపాలరావు వివాహానికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. వివాహమైన అనంతరం శాంతికుమారి తన భర్తకు తెలియకుండా గోపాలరావుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. బోసు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా చేసే సమయంలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని శాంతికుమారిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అంతేకాకుండా భార్య శాంతికుమారి వద్ద ఉన్న డబ్బులు కూడా బలవంతంగా తీసుకున్నాడు. తరచూ తనను హింసించడంతో భర్త బోసుబాబు అడ్డు తొలగించాలని శాంతికుమారి, గోపాలరావు నిర్ణయించుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తుండగా జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో జరిగిన అవకతవకలపై పత్రికలో వచ్చిన కథనాలను ఆమె భర్త బోసు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయమై అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు బోసును ఫోన్‌లో బెదిరించిన కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో తన భర్త బోసుబాబును ఏం చేసినా అది చిర్రి వెంకటేశ్వరరావు మీదకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ శాంతికుమారి గోపాలరావును రాత్రి ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టింది. తర్వాత బోసు, పిల్లలు ఇంటి పోర్షన్ బయట వరండాలో పడుకుని పూర్తిగా నిద్రలోకి వెళ్లిన తర్వాత శాంతికుమారి సాయంతో గోపాలరావు తనతోపాటు తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో బోసు తలపై కుడి వైపున ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. తర్వాత అక్కడి నుంచి గోపాలరావు ఆ రాడ్డుతో పారిపోయాడు. ఈ ఘటనపై ఈనెల 18వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేయగా భర్త బోసు పెట్టే బాధలు భరించలేకే శాంతికుమారి, గోపాలరావు వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఈ హత్య చేసినట్లు ముద్దాయిలిద్దరూ అంగీకరించారని సీఐ తెలిపారు. అలాగే హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసు దర్యాప్తుకు సహకరించిన కై కలూరు రూరల్ సీఐ, పోలవరం, గణపవరం సీఐలు, చాట్రాయి, ముదినేపల్లి, కొయ్యలగూడెం ఎస్సైలు, సర్కిల్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.
బోసుబాబు హత్యకేసును ఛేదించిన పోలీసులు
కేసుకు సంబంధించి ఇద్దరి అరెస్ట్