ఇళ్లు.. మంజూరు నిల్లు
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
భీమవరం (ప్రకాశంచౌక్): సొంతింటి కల సాకారం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కొత్త ఇంటిని కూడా మంజూరు చేయకపోవడంతో ఊసురుమంటున్నారు. కొత్త ఏడాదిలో అయినా ఇళ్ల మంజూరు ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున అర్హులైన పేదలకు అందించారు. వీరిలో 50 శాతం మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. మిగిలిన లబ్ధిదారులతో పాటు సొంత స్థలం కలిగిన వారు ఇళ్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బిల్లులపై బెంగ
గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఉండి ఇళ్లు మంజూరు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్న వారు అప్పు చేసి నిర్మాణాలు చేపడితే తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందా, లేదా అనే మీమాంశలో ఉన్నారు. తీరా అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. చేసిది లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారు.
అర్జీల వెల్లువ
ప్రభుత్వం ఇచ్చిన స్థలం కలిగిన వారు, సొంత స్థలం ఉన్న వారు కొత్త ఇళ్ల మంజూరు కోసం ప్రతి సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి అర్జీలు అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని ఆన్‌లైన్ చేసే చర్యలు కూడా అధికారులు చేపట్టడం లేదు. జనవరి నుంచి వేసవికాలం పూర్తయ్యే వరకూ ఇళ్ల నిర్మాణాలకు అనుకూలం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే నిర్మాణాలు ప్రారంభించే యోచనలో పలువురు ఉన్నారు. వర్షాకాలంలో ఇళ్లు మంజూరు చేస్తే ఇసుక కొరత, వర్షాలతో నిర్మాణాలు సాగవని అంటున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. జిల్లాలో లేఅవుట్‌లు, సొంత స్థలాలు కలిగిన వారికి సుమారు 70 వేల ఇళ్లు మంజారు చేయగా 36 వేల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో అధిక శాతం పట్టణాలకు చెందిన లేఅవుట్లలో ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో ఇళ్లు మంజూరు చేసింది. జిల్లాలో 15,197 ఇళ్లు మంజూరు చేయగా.. మండలాల వారీగా ఆచంటలో 959, పెనుగొండలో 843, పెనుమంట్రలో 1,013, పోడూరులో 543, భీమవరం రూరల్‌లో 646, భీమవరం అర్బన్‌లో 182, వీరవాసరంలో 598, మొగల్తూరులో 586, నరసాపురంలో 567, నరసాపురం అర్బన్‌లో 212, పాలకొల్లులో 149, యలమంచిలిలో 1,044, పెంటపాడులో 895, తాడేపల్లిగూడెంలో 1,030, తాడేపల్లిగూడెం అర్బన్‌లో 464, అత్తిలిలో 711, ఇరగవరంలో 838, తణుకులో 723, తణుకు అర్బన్‌లో 277, ఆకివీడులో 302, ఆకివీడు అర్బన్‌లో 114, కాళ్లలో 397, పాలకోడేరులో 637, ఉండిలో 876 ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో జిల్లాలో కేవలం 595 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. అది కూడా కేవలం పట్టణాలకు మాత్రమే. వీటిలో భీమవరంలో 85, తణుకులో 111, పాలకొల్లులో 60, తాడేపల్లిగూడెంలో 149, ఆకివీడులో 115, నరసాపురంలో 75 ఉన్నాయి. జిల్లాలో 20 మండలాల్లో 409 గ్రామాలు ఉండగా ఇక్క ఇంటినీ మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా తమ ప్రభుత్వం మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకుంటూ గృహప్రవేశాలు మాత్రం చేయించింది. ఇటీవల జిల్లాలో పూర్తి చేసిన 6 వేల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో మంజూరు చేసినవి కావడం గమనార్హం.
పాలకోడేరు మండలం కొండేపూడికి చెందిన లక్ష్మికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సెంటున్నర స్థలం వచ్చింది. అయితే పలు కారణాలతో అప్పట్లో నిర్మాణం చేపట్టలేదు. ఏడాది కాలంగా ఇంటి మంజూరు కోసం ఎదురుచూస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో కొత్త ఇళ్లు మంజూరు చేయలేదు. దీంతో లక్ష్మి సొంతింటి కల సాకారం కాలేదు. ఇలా జిల్లాలో లక్ష్మి లాంటి ఎందరో మహిళలు ఇళ్ల మంజూరు కోసం వేచి చూస్తున్నారు.
గృహయోగం ఎప్పుడో ?
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేయని చంద్రబాబు సర్కారు
ఏడాదిన్నరగా లబ్ధిదారుల ఎదురుచూపులు
జిల్లాలో పట్టణ ప్రాంతాలకే కేవలం 595 గృహాల మంజూరు
పేదల సొంతింటి కల సాకారంలో నిర్లక్ష్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 36 వేల ఇళ్లు పూర్తి


