రియల్ ఎస్టేట్ నేలచూపులు
● గూడెంలో చతికలపడ్డ వ్యాపారం
● స్థలాలు, భవనాలను కొనే నాథుడే కరువు
తాడేపల్లిగూడెం: ఏడాదిన్నరగా ప్రభుత్వ నిబంధనలు, అన్నీ ఉన్నా ఎవరినీ సంతృప్తిపర్చలేని సందిగ్ధ స్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాడేపల్లిగూడెం అడ్డాగా ఉంది. వాణిజ్య కేంద్రం కావడం, జాతీయ విద్యాసంస్థ, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వంటివి ఉండటంతో విస్తరించే అవకాశాలు నియోజకవర్గం నా లుగు వైపులా ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ వ్యా పారులు, బ్రోకర్లు వందల సంఖ్యలో ఇక్కడ తయారయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. అన్నిరకాల అనుమతులతో స్థలాలను పూడ్చి విక్రయిద్దామంటే కొనే వారు కరువయ్యారు. ఇసుక ధరలు కలవరపెడుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు రోజు వారీ వేతనాలకు ఆసక్తి చూపడం లేదు. అడుగుల వంతున నిర్మాణాలకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాల కోసం యజమానులు స్థలాలు కొనడం లేదు.
బోణీ కావడం లేదు : తాడేపల్లిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నల్లజర్ల వైపు స్థలాలను ఎక్కువగా పూడుస్తున్నారు. డీ మార్టు దగ్గర నుంచి మరో వైపు పాత మిర్చిడాబా వరకు వ్యవసాయ క్షేత్రాలను, వాణిజ్య భూములుగా పూడ్చి లేఅవుట్‌లుగా మారుస్తున్నారు. అయితే వీటిలో కొన్ని స్థలాలకు అనుమతులు కూడా లేవు. అధికారం అండతో పొలాలను పూడ్చుకుంటూ వెళుతున్నారు. ఏపీ నిట్ రోడ్లలో సకల సదుపాయాలతో ఇటీవల పెద్ద వెంచర్లు వెలిశాయి. రహదారులు, విద్యుత్‌లైన్లు, మంచినీటి పైపులైన్లు వంటివి ఏర్పాటుచేశారు. ఇక్కడ గజం ధర రూ.17,500గా నిర్ణయించారు. అయినా బోణీ కావడం లేదు. మార్కెట్‌లో నగదు లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. ఎవరి చేతిలోనూ సొమ్ములు ఆడటం లేదు. గతంలో సంక్షేమ పథకాల రూపంలో సొమ్ములు జమయ్యేవి. నెలవారీ ఖర్చులకు ఈ సొమ్ములను వినియోగించుకున్నా.. అదనపు ఆదాయాలను స్థలాలు, భవనాలు వంటివి కొనుగోలు చేయడానికి వాడేవారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితులు తారుమారు కావడంతో ‘రియల్’ వ్యాపారం పతనమైంది.


