తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగగుంట గ్రామానికి చెందిన బోనగిరి రమేష్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఆర్యవైశ్య సంఘంలో కీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న రమేష్ సేవలను గుర్తించి, ఈ అవార్డు ప్రదానం చేశారు.
48 మద్యం సీసాల స్వాధీనం
ఆగిరిపల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు. మండలంలోని తోటపల్లిలో ఆరేపల్లి వేణుగోపాల్ అనే వ్యక్తి అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో ఆదివారం సిబ్బందితో కలిసి దాడి చేసి అతని వద్ద ఉన్న 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాట్నాలమ్మకు రూ.1,26,343 ఆదాయం
పెదవేగి: భక్తుల తాకిడితో రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం కిటకిటలాడింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాలమ్మ తల్లికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుంలతో రూ.60,850, విరాళాలుగా రూ.36,493, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.27,000, ఫొటోల అమ్మకం వల్ల రూ.2,000 ఆదాయం లభించగా, మొత్తం ఆదాయం రూ.1,26,343 లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ప్రదానం