నూజివీడు: తుక్కులూరులో పదేళ్లుగా రెవెన్యూ పోరంబోకు భూమిలో ఉన్న గేదెల పూరి పాకను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ పాక వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడైన కొలుసు భాస్కరరావుకు చెందినది కావడంతో ఈ నెల 18న అధికారులు ఆఘమేఘాలపై వచ్చి తొలగించడం గమనార్హం. అదే గ్రామంలో మచిలీపట్నం–కల్లూరు జాతీయ రహదారి మార్జిన్‌లను ఆక్రమించుకొని అనేక దుకాణాలున్నప్పటికీ వాటి వైపు మాత్రం రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కొలుసు భాస్కరరావు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడుగా ఉండటమే కాకుండా అతని భార్య గ్రామంలో అమూల్ పాలకేంద్రాన్ని నడుపుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అమూల్ కేంద్రాన్ని వదిలేయమని ఆమైపె ఒత్తిడి తీసుకువస్తున్నారు. దానికి నిరాకరించడంతో తమ మాట వినడం లేదని చెప్పి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి గేదెల పాకను తొలగించేలా చేశారు. దీంతో భాస్కరరావు తన గేదెలను కట్టేసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.