
దారి దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలో గత నెలలో ఒక వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ.2.40 లక్షలు దోచుకెళ్లిన దారి దోపిడీ ముఠాను ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన కల్లపల్లి దుర్గా నాగ వెంకట కొండలరావు అలియాస్ పండు అనే వ్యక్తి ఏలూరులోని ఆదిత్య అసోసియేషన్ అనే హిందుస్థాన్ లివర్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేసి మానివేశాడు. అక్కడ అకౌంటెంట్‌గా పనిచేసే గొట్ట వీరేష్ నిత్యం సంస్థ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నగదును వెంట తీసుకువెళ్లి తిరిగి మరలా ఉదయం కార్యాలయానికి తీసుకురావడాన్ని పండు గమనించాడు. ఆ సొమ్మును కాజేసేందుకు పండు తన స్నేహితులైన ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి చెందిన గుమ్మల మణికంఠ, అతని బావమరిది కల్లపల్లి చందు అలియాస్ అచ్చులతో కలిసి వీరేష్ కదలికలపై రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వీరేష్ మోటారుసైకిల్ పై ఇంటికి వెళుతుండగా ముగ్గురూ కలిసి వీరేష్ కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ 2.40 లక్షల నగదు బ్యాగును అపహరించి పారిపోయారు. బాధితుడు ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏలూరు వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ప్రత్యేక బృందంతో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.90 లక్షల నగదును, మోటారు సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏలూరు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎ. సత్యనారాయణ, సీసీఎస్ సీఐ రాజశేఖర్, ఎస్సై కే.మదీనాబాషా, ఎస్సై బీ.నాగబాబు, సీసీఎస్ ఏఎస్సై ఎస్.రాజకుమార్, అహ్మద్, కానిస్టేబుళ్లు ఆర్.మోహనకృష్ణ, బీ నాగార్జున, ఎన్.శేషుకుమార్, ఎ.యశ్వంత్ కుమార్, టీ.సురేష్‌కుమార్, ఎండీ రుహుల్లాలను ఎస్పీ అభినందించారు.