
ఎస్సీ వర్గీకరణకు నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం
భీమవరం: ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యుత్సాహం తన రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం అందజేస్తుండగా భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఎస్సైలు రెహమాన్, ఇజ్రాయిల్ అడ్డుకున్నారు. అనంతరం పుష్పరాజ్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పుల వల్లనే కొన్నేళ్లు అధికారానికి దూరమయ్యారని మళ్లీ కూటమి ప్రభుత్వంతో అంటకాగి ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ పతనానికి దారితీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మాల, మాదిగలు అన్నదమ్ముల భావంతో కలిసి మెలిసి ఉంటుండగా వర్గీకరణ పేరుతో వారిని విడగొట్టి పబ్బం కడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తెలుసుకోవాలని రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం చాలా దారుణమన్నారు. ఇప్పటికై నా చెల్లుబాటు కానీ వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో చేయాలని, లేకుంటే వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని పుష్పరాజ్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నేతల సువర్ణరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి రాజేష్, పిట్టా వినోద్ కుమార్,గడ్డం అబ్రహం, జొన్నల వజ్రం, యాకోబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.